తెలంగాణలో రాజకీయ మార్పునకు నాంది

 

🔹బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం
🔹కేసీఆర్ మోసాలతో జనం విసిగిపోయారన్న బండి సంజయ్
🔹నేడు హైదరాబాద్ నగరంలో కొనసాగనున్న ప్రజా సంగ్రామ యాత్ర
🔹ప్రజా సంగ్రామ యాత్రలో నిప్పులు చెరిగిన బీజేపీ నేతలు

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) అనివార్య కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర శనివారం ప్రారంభమైంది. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్రను పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించిన అనంతరం బండి సంజయ్ ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, నేతలు డీకే అరుణ, విజయశాంతి, ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చార్మినార్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ మార్పునకు ఈ యాత్ర వేదిక కానుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1400 మంది బలిదానాలని చేశారని, వారి ఆకాంక్షలకు, ఆశయాలకు భిన్నంగా రాష్ట్రంలో ఒక్క కుటుంబమే పాలన సాగిస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్ హాయంలో ఏ ఒర్గం కూడా సంతోషంగా లేదని మండిపడ్డారు. మాటలతో మభ్యపెడుతూ కేసీఆర్ పబ్బం గడుపుతున్నారని దుయ్యబట్టారు.

రైతులందరికీ ఉచిత యూరియా ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగ యువకులను కేసీఆర్ మోసగించారని బండి సంజయ్ విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడెనిమిదేళ్లు దాటినా ఇంత వరకు వాటి గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. ఒక్క నిరుద్యోగికి కేసీఆర్ ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున బాకీ ఉందని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, దళితుడిని సీఎం చేస్తానన్న హామీలను సీఎం కేసీఆర్ అటకెక్కించారని మండిపడ్డారు. ఇప్పుడు దళితబంధు పేరుతో దళితులను.. గొర్రెలు, బర్రెలంటూ బీసీలను కేసీఆర్ వంచిస్తున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీలో ఎంఐఎం ఆగడాలను తట్టుకుని హిందువులు జీవిస్తున్నారని, పాతబస్తీని ఇది వరకే వదిలివెళ్లిన హిందువులంతా తిరిగి రావాలని సంజయ్ పిలుపునిచ్చారు. కాగా, చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. చార్మినార్, మదీనా, బేగంబజార్ మీదుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు యాత్ర చేరుకుంటుంది. అక్కడ లంచ్ కార్యక్రమం తర్వాత నాంపల్లి మీదుగా వెళ్తుంది. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తారు సంజయ్. సమీపంలోని సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహానికి, అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి లక్డీకాపూల్, మాసాబ్ ట్యాంక్, మెహిదీపట్నం మీదుగా పాదయాత్ర నిర్వహిస్తారు. మెహిదీపట్నం పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీ ప్రాంగణంలో రాత్రి బస చేస్తారు సంజయ్. కాగా, అంతకు ముందు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్… ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీనియర్ నేతలతో కలిసి గో పూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీ ముఖ్యనేతలతో కలిసి చార్మినార్ చేరుకున్న సంజయ్… భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు నేడు సిటీలోనే సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.. రోజుకు 10 కిలోమీటర్లు నడుస్తూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించనున్నారు సంజయ్. ప్రజా సంగ్రామయాత్ర కోసం 30 కమిటీలను 6 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు.

🔹ప్రజా సంగ్రామ యాత్రతో నిజాం లాంటి కేసీఆర్ పాలన అంతం – కిషన్ రెడ్డి

ప్రజా సంగ్రామయాత్ర ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో నిజాంలాంటి పాలన అంతం కావాలన్నారు. అప్పుల పాలనపోవాలన్నారు. కుటుంబ పాలనకు తెరదించి ఒక ప్రజాస్వామ్య పాలనకు ప్రజలు స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే ఉద్యమంం ఈ ప్రజా సంగ్రామ యాత్ర అని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం అబద్ధాల పాలన సాగిస్తోందని మండిపడ్డారు. అవినీతి పాలనపోయి.. నీతివంతమైన పాలన రావాలంటే కేసీఆర్ కుటుంబపాలనకు చరమగీతం పాడాలన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ కాలేదన్నారు.

🔹తెలంగాణను అలీబాబా దొంగల్లా పాలిస్తున్నారన్న తరుణ్ చుగ్..

రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు అంతం కోసమే ఈ యాత్ర నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు బీజేప ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. రాష్ట్ర రాజకీయాల్లో ఈ యాత్రతో పెనుమార్పులు సంభవించబోతున్నాయని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనేని, టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ పాలన నుంచి విముక్తి కలిగించాలని అన్నారు. రాష్ట్రాన్ని అలీబాబా 40 దొంగల్లా పాలిస్తున్నారని దుయ్యబట్టారు. మహాత్మా గాంధీ యాత్రతో బ్రిటిష్ వాళ్ళు పారిపోయినట్లు.. బండి యాత్రతో తెలంగాణ నుంచి కేసీఆర్ పారిపోతారన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే పోలీసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. పేదల సమస్యల పై బండి సంజయ్ యాత్ర చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ అనే రావణుడిపై ప్రతీ బీజేపీ కార్యకర్త.. రాముడి అవతారం ఎత్తి పోరాడాలని చెప్పారు.

🔹కేసీఆర్ ప్రకటనలు హాస్యాస్పదమన్న విజయశాంతి

ఇది ఇలావుండగా, కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ దళితుల కోసం చివరి రక్తపుబొట్టు వరకూ సేవ చేస్తా అన్న ప్రకటన కన్నా హస్యాస్పదమైన అంశం ప్రస్తుతం మరొక్కటి ఉండదు. దళిత ముఖ్యమంత్రి పదవి గుంజుకుని… దళిత డిప్యూటీ సీఎంలను అవమానకరంగా వెళ్ళగొట్టి… 3 ఎకరాల భూమి అంటూ మోసగించి… డబుల్ బెడ్రూం ఇళ్ళు ఎగ్గొట్టి… నిరుద్యోగభృతికి సున్నా చుట్టి… ఇప్పుడు ఏడేళ్ళ కాల పరిపాలనల దళితుల పట్ల సర్వ ద్రోహాలకూ పాల్పడ్డ ఈ దొర ముఖ్యమంత్రి, హుజురాబాద్ భయంతో అనేక అసత్యాలు మాట్లాడుతున్నరు. ఇంకా, చావు నోట్ల తల బెట్టి తెలంగాణ తెచ్చిన… అన్న అబద్ధం వారు చెప్పకుంటే మేలు. ప్రజలు నవ్వుకుంటారు. కేసీఆర్ దొంగ దీక్ష ఖమ్మం హస్పిటల్… ఇంకా నిమ్స్‌ల నడిచింది 2009ల… ప్రజా ఉద్యమాలతో తెలంగాణ వచ్చింది 2014ల… ఆనాటి హాస్పిటళ్ళలో కేసీఆర్ తీసుకున్న ఆహార జ్యూస్‌లు, ఓయు నుంచి విద్యార్థి సంఘాల హెచ్చరికలు, ఇంకా ఐవీ ఫ్లూయిడ్‌లు, దీక్ష విరమణకై ప్రభుత్వాన్ని బ్రతిమాలుకున్న అంశాల్ని ఇంకా తెలంగాణ సమాజం యాద్ మర్వలే.. అంటూ విజయశాంతి నిప్పులు చెరిగారు.