తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఏర్పాటు
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ వ్యవహారాల కమిటీ ఏర్పాటైంది. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మొత్తం 17 మంది సీనియర్ నేతలకు ఈ కమిటీలో చోటు కల్పించింది. వారితో పాటు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలంగాణకు చెందిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులు, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ కార్యదర్శులు ఇందులో సభ్యులుగా కొనసాగుతారు. ఇక మీదట ఎలాంటి రాజకీయపరమైన నిర్ణయాలను తీసుకోవాలన్నా.. ఈ కమిటీలో చర్చించిన తరువాతే.. ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. రాజకీయ వ్యవహారాల కమిటీకి సంబంధించిన జాబితాను ఆదివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. ఈ కమిటీకి తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ ఛైర్మన్ వ్యవహరిస్తారు. ఇందులో- పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంత రావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, నల్లగొండ లోక్‌సభ సభ్యుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అలాగే- మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టీ జీవన్ రెడ్డి, కేంద్ర మాజీమంత్రులు రేణుకా చౌదరి, పీ బలరాం నాయక్, భువనగిరి లోక్‌సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే పోడెం వీరయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇందులో సభ్యులుగా ఉంటారు. షబ్బీర్ అలీ సమన్వయకుడిగా వ్యవహరిస్తారు. వారితోపాటు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలంగాణకు చెందిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులు, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ కార్యదర్శులు ఇందులో సభ్యులుగా కొనసాగుతారు.
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించిన తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో క్రీయాశీలకమైన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోన్న దళిత బంధు పథకాన్ని అందరికీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఇంద్రవెల్లిలో బహిరంగ సభను సైతం నిర్వహించింది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించబోయే ఉప ఎన్నిక కోసం సమాయాత్తమౌతోందా పార్టీ. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయాన్ని సాధించడం ద్వారా వరుస ఓటములకు చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనికోసం సర్వశక్తులను ఒడ్డుతోంది. అభ్యర్థి ఇంకా ఖరారు కానప్పటికీ.. మాజీ మంత్రి కొండా సురేఖ పేరు విస్తృతంగా వినిపిస్తోంది. ఆమెను హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా బరిలోకి దించుతుందనే ప్రచారం సాగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ వ్యవహారాల కమిటీ ఏర్పాటు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.