దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ – సీఎం జగన్
🔹ప్రజల సంక్షేమం కోసం ఏమైనా చేయడానికి సిద్ధం
అమరావతి (ప్రశ్న న్యూస్) రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. రెండేళ్ల కిందట ఇదే రోజు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల వద్ద జెండాలను ఎగరవేశారు. కేక్ కట్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ జెండాను ఎగురవేశారు. కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు వైఎస్ జగన్‌ను కలిసి, అభినందనలు తెలిపారు.మలియేడు-జగనన్నతోడు పేరుతో తన రెండేళ్ల పరిపాలనపై రూపొందించిన డాక్యుమెంట్లను వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన హామీలు.. అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చిన హామీలతో కూడిన డాక్యుమెంట్లు అవి. మొత్తం 129 హామీలను ఇచ్చినట్టు పొందుపరిచారు. ఇందులో అమలు చేసినవి-107, అమలు దిశగా అడుగుల పడ్డవి-15, అమలు కావాల్సినవి-7గా పేర్కొన్నారు. ఇవే కాకుండా.. అధికారంలోకి వచ్చిన తరువాత అదనంగా మరో 40 హామీలను అమలు చేసినట్లు ముఖ్యమంత్రి.. ఈ డాక్యుమెంట్లలో వివరించారు. వాటిని ప్రతి ఇంటికీ అందజేస్తామని, లబ్దిదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామని చెప్పారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రజలందరి చల్లని దీవెనలతో రెండు సంవత్సరాల పాలన పూర్తిచేసుకోగలిగామని అన్నారు. ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షమ పథకం అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో 1,64,68,591 కుటుంబాలు ఉంటే.. 1,41,52,386 కుటుంబాలకు ఏదో ఒక సంక్షేమ పథకం చేరిందని వివరించారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ.95,528 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని, మరో 36,197 కోట్ల రూపాయలను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, జగనన్న తోడు, సంపూర్ణ పోషణ, ఇళ్ల స్థలాలు, వైఎస్సార్ కంటి వెలుగు ద్వారా ప్రజలకు చేరవేసినట్లు తెలిపారు.లంచాలు, వివక్ష, దళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాల లబ్దిని నేరుగా ప్రజలకు అందించగలిగామని, దేవుడి దయ, ప్రజల దీవెనలే దీనికి కారణమని చెప్పారు. ప్రతి గ్రామ వలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రభుత్వ యంత్రాంగంలోని ప్రతి ఒక్కరు దీనికి తమవంతు సహకారాన్ని అందించారని ప్రశంసించారు. వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్లకాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశంపై ఏమేమి చేయగలిగామని వివరించే ప్రయత్నం చేస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు.
ఎన్నికల మేనిఫెస్టో అనేది భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి.. రెండేళ్లలో అందులోని ప్రతి హామీని పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో పనిచేశామని వైఎస్ జగన్ అన్నారు. మేనిఫెస్టోలో చెప్పని అంశాలు ఎన్ని అమలు చేశామని ప్రతీది టిక్కుపెట్టి వివరణ ఇస్తూ మరో డాక్యుమెంట్‌ను ప్రతి ఇంటికి పంపిస్తున్నామని చెప్పారు. ఈ రెండు సంవత్సరాల్లో 94.5 శాతం హామీలను పూర్తిచేశామని గర్వంగా తెలియజేస్తున్నానని అన్నారు. ఇందులో 66 శాతం పథకాలు అక్కచెల్లెమ్మలకే చెందుతున్నాయని పేర్కొన్నారు.ఈ రెండు సంవత్సరాల కాలంలో తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని వైఎస్ జగన్ అన్నారు. రాబోయే మూడు సంవత్సరాల్లో కూడా ప్రతి ఒక్కరి ఆశను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటామని, ప్రజల దీవెనలతో ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తానని అన్నారు. తన పరిపాన ఎలా ఉందనే విషయాన్ని ఈ డాక్యుమెంట్ల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పులు ఉంటే సరిదిద్దుకుంటామని, మరింత ఆత్మవిశ్వాసంతో వచ్చే మూడేళ్లలో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని అన్నారు.