Krishna Barrage

 

పవర్ వార్

 

🔹జల విద్యుత్ కోసమే శ్రీశైలం
🔹ఏపీ వాదన నిరాధారం
🔹కేఆర్ఎంబీకి తెలంగాణా లేఖ

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తెలంగాణ ఏపీ రాష్ట్రాల మధ్య చోటుచేసుకున్న జల జగడం చిలికి చిలికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు తో మొదలైన వివాదం కాస్త రచ్చగా మారడంతో పవర్ వార్ తెర మీదకు వచ్చింది . ఆంధ్ర ప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి తెలంగాణ రాష్ట్రం అనుమతులు లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాయడంతో, తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలను పై సమాధానం చెప్పాలని, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ నుండి తెలంగాణ రాష్ట్రం సాగిస్తున్న విద్యుత్ ఉత్పత్తి నిలుపుదల చేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు రాసిన లేఖపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తమ స్పందన లేఖ ద్వారా తెలియజేసింది. కృష్ణా బోర్డు రాసిన లేఖకు స్పందనగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ బోర్డు చైర్మన్ కు రాసిన లేఖలో శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించిన సమయంలో ప్లానింగ్ కమిషన్, కృష్ణా మొదటి ట్రిబ్యునల్ పూర్తి స్థాయిలో విద్యుత్ వినియోగానికి అనుమతి ఇచ్చిందని, అందుకు అనుగుణంగానే తాము విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నామని వెల్లడించారు. అసలు శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే జల విద్యుత్ కోసమని ఆయన లేఖ ద్వారా పేర్కొన్నారు.

జల విద్యుత్ ను ఉత్పత్తి చేయడానికి మాత్రమే ఈ ప్రాజెక్టులోని నీటిని ఉపయోగించాలని ఇతర అవసరాలకు మళ్లించడానికి వీలు లేదని గతంలో ప్రణాళిక సంఘం చెప్పిందని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1991 నుండి ఇప్పటివరకు ఏప్రిల్, మే నెలలో ఏ రోజు శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 834 అడుగులకు పైగా ఉండేలా చూడలేదన్నారు. కానీ ప్రస్తుతం 854 అడుగులు పైన నీటిమట్టం ఉండాలని కోరుతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ చేస్తున్న వాదన నిరాధారం అన్నారు. తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే ఏపీకి నష్టం జరుగుతుందనడం అవాస్తవమన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం శ్రీశైలంలో 854 అడుగులు నీటి మట్టం నుంచి ఆ నీటిని ఇతర బేసిన్ లకు తరలించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో 50: 50 నిష్పత్తిలో విద్యుత్ పంచాలని విభజన చట్టంలో లేదని కూడా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి వల్ల ఏపీలో నీటి కొరత సంభవిస్తుందని వాదనలో నిజం లేదని, విద్యుత్ ఉత్పత్తి వల్ల ఏపీ సాగు, తాగునీటికి ఇబ్బందులు కలుగుతాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదని మురళీధర్ తన లేఖలో స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ఏపీ రెండేళ్లుగా 170 టీఎంసీలు 120 టీఎంసీలు బేసిన్ వెలుపలకు తరలించిందని, ఇక పెన్నా బేసిన్లో 360 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు కట్టిందని వెల్లడించారు. ఇప్పుడు ఏపీ చేస్తున్న రాద్ధాంతం కూడా నీటిని ఇతర బేసిన్ లకు తరలించడం కోసమేనని లేఖలో స్పష్టం చేశారు. చెన్నై తాగునీటి కోసం 10 టీఎంసీలు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ప్రకారమే నీటిని వినియోగించుకుంటున్నామని, విద్యుదుత్పత్తితో లింకు పెట్టి ఆరోపణలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం తీరుపై అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ వెల్లడించారు.