అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారం శైలపుత్రి

1. శైలపుత్రి

నవరాత్రుల మొదటి రోజు అయిన పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. శైలం అంటే కొండ. పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టీ ఈమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం. తపస్సు ఆచరించిన ఆమె శివుడిని వివాహం చేసుకునేందుకు, మేనకా, హిమవంతులకిచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది అమ్మవారు. ఈమెనే హైమవతీ, శైలజ, శైలపుత్రీ అని కూడా పిలుస్తారు. రుతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రీదేవి. నందిపై కూర్చుని ములాధారా చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు. లౌకికంగా తండ్రి(హిమవంతుడు) నుంచి భర్త(శివుడు)ను వెతుక్కుంటూ ప్రయాణించింది శైలపుత్రీదేవి. మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన.

అందుకే నవరాత్రి పూజలు చేసేవారు, యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి, ధ్యానిస్తారు. ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తొలి మెట్టుగా చెప్తుంటారు. ఇదే యోగసాధనకు ప్రధమమైనది. శైలపుత్రీదేవి మూలాధారా శక్తికి అధిష్టాన దేవత. ఎన్ని జన్మలకైన శివకుటుంబిణి కాబట్టీ తన భర్త అయిన శివుణ్ణి వెతికి, ధ్యానించి, సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా తననే ఉన్న దైవాన్ని దర్శించవచ్చు అని చెప్తుంటారు. శైలపుత్రి దేవిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు. శైలపుత్రీ దుర్గా దేవి అచ్చంగా పార్వతీదేవి. శివమహాపురాణం ప్రకారం ఈ భూమి అంతా శైలపుత్రీదేవిలో నిబిడీకృతమై ఉంది. ఈ సృష్టిలోని ప్రకృతి అంతా ఆమె శరీరంలోనే ఉంది. శైలపుత్రిగా అంటే శ్రీబాలా త్రిపురసుందరి దేవిగా పసుపు రంగు వస్త్రాలు, పువ్వులతో అలంకారముగా అవతరిస్తుంది. నవరాత్రులలో మొదటి రోజు అమ్మ దుర్గాదేవికి సమర్పించుకొనే నైవేద్యం నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తారు. రెండువ పద్ధతి నవరాత్రి దుర్గా దేవికి పొంగలి నైవేద్యంగా పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది.

మంత్రం :

“ ఓం దేవి శైల్పుత్రి నమహా ”

శైలపుత్రీ ధ్యాన శ్లోకం :

“ వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం |
వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ || ”

శ్లోకానికి అర్ధం : వృషభాన్ని అధిరోహించి, కిరీటంలో చంద్రవంకను ధరించి, యశశ్శు కలిగి, భక్తుల మనః వాంఛలను తీర్చే మాతా శైలపుత్రీ దుర్గా దేవికి నా వందనం/నమస్కారం అర్పిస్తున్నాను.