Revanth

 

హుజురాబాద్ అభ్యర్థి ప్రకటనపై కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు

 

🔹అభ్యర్థిని ప్రకటించాలని కోమటిరెడ్డి.. తొందరేమీ లేదన్న మల్లు రవి
🔹రేవంత్ లైట్ తీసుకుంటున్నారా…?
🔹కనిపించని రేవంత్ దూకుడు
🔹అసలేం జరుగుతోంది..?

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) హుజురాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో ఉంటుందా ఉండదా అనే సందేహాలు ఓవైపు వెంటాడుతున్నా… ఎన్నిక ఎప్పుడొచ్చినా సరే ఇప్పటినుంచే యుద్ధం మొదలుపెట్టాలన్నట్లుగా టీఆర్ఎస్,బీజేపీ ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికైతే కాంగ్రెస్ హుజురాబాద్‌పై పెద్దగా ఫోకస్ పెట్టినట్లు కనిపించడం లేదు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌ను నియమించడంతో హుజురాబాద్‌లో త్రిముఖ పోరు తప్పదనే విశ్లేషణలు జరిగినప్పటికీ… కాంగ్రెస్ తీరు మాత్రం ఉపఎన్నికను లైట్ తీసుకుంటున్నారేమోననే సందేహాలకు తావిస్తోంది. కాంగ్రెస్‌ కీలక నేత,ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెంటనే అభ్యర్థిని ప్రకటించాలని విజ్ఞప్తి చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. ‘హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన ఎప్పుడెప్పుడా అని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. వెంటనే అభ్యర్థిని ప్రకటించి హుజురాబాద్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలి.’ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని ట్విట్టర్ ద్వారా కోరారు. కాంగ్రెస్ నాయకత్వం హుజురాబాద్ ఉపఎన్నిక విషయంలో ఒకరకమైన అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా కోమటిరెడ్డి వ్యాఖ్యలు ధ్వనిస్తున్నాయి. గెలుపు కోసం కృషి చేయాల్సిన సమయం ఇది అంటూ కోమటిరెడ్డి కాంగ్రెస్ నాయకత్వానికి గుర్తుచేయడం చర్చనీయాంశంగా మారింది.

ఓవైపు వెంటనే అభ్యర్థిని ప్రకటించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి నేతలు కోరుతుంటే… మరోవైపు మల్లు రవి లాంటి సీనియర్ నేతలు దానికి పెద్ద తొందరేమీ లేదని కూల్‌గా చెబుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ ఠాగూర్,టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు,సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు,ఛైర్మన్లతో చర్చించి అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. జిల్లా నాయకుల అభిప్రాయం కూడా సేకరించి రెండు,మూడు రోజుల్లో ప్రకటన చేయవచ్చునని చెప్పారు.హుజురాబాద్ ఉపఎన్నికకు అభ్యర్థి ప్రకటన ఆలస్యమవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఇప్పటికీ నోటిఫికేషన్ రాలేదనే విషయాన్ని గుర్తుచేశారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్,బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు లేదా ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం అక్కడ కనిపించట్లేదు. మొదట్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కొంత హడావుడి చేసినా ఆ తర్వాత ఆయన కూడా ముఖం చాటేశారు.నియోజకవర్గానికి ఇన్‌చార్జిలను ప్రకటించినా… ఎవరూ అటువైపు వెళ్లడం లేదు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటివరకూ హుజురాబాద్‌లో అడుగుపెట్టలేదు. ఆయన కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక వస్తున్న మొదటి ఎన్నిక కావడంతో… దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారని అంతా భావించారు. కానీ రేవంత్ వైఖరి ఇందుకు విరుద్ధంగా ఉందనే వాదన వినిపిస్తోంది. హుజురాబాద్‌‌లో సీన్ అర్థమైనందునే రేవంత్ ఉపఎన్నికను లైట్ తీసుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది.

సహజంగానే రేవంత్ అంటే దూకుడైన శైలి అని చెబుతారు. కానీ ఆ దూకుడు హుజురాబాద్‌లో కనిపించట్లేదు. టీఆర్ఎస్,బీజేపీ అభ్యర్థులను ప్రకటించకపోయినా మొదటి నుంచి అక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అభ్యర్థిని ప్రకటించాక టీఆర్ఎస్ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. మంత్రి,ట్రబుల్ షూటర్ హరీశ్ రావును రంగంలోకి దింపింది. అటు ఈటలతో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం హుజురాబాద్‌పై ఫోకస్ పెట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకుని ఫైట్ చేస్తే… అంచనాలు తలకిందులైన పక్షంలో ఆదిలోనే ఓ ఓటమి తన ఖాతాలో చేరుతుందని రేవంత్ భావిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి కొండా సురేఖ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే హుజురాబాద్‌లో పోటీ చేసేందుకు ఆమె సుముఖత చూపుతారా అనేది తేలాల్సి ఉంది. కరీంనగర్ డీసీసీ కవ్వంపల్లి సత్యనారాయణ,వరంగల్‌కు చెందిన సీనియర్ నేత దొమ్మాటి సాంబయ్యల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో మరో పేరు వచ్చి చేరింది. కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకుడు పత్తి కృష్ణారెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్,బీజేపీ బీసీ నేతలను రంగంలోకి దింపుతుండటంతో కాంగ్రెస్ కూడా బీసీ వర్గానికి చెందిన కొండా సురేఖను బరిలో దింపవచ్చుననే ప్రచారం జరుగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఆనుకునే గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన పరకాల నియోజకవర్గం ఉంది. కాబట్టి నియోజకవర్గంపై అంతో ఇంతో కొండా దంపతుల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పోటీ విషయమై వారికి నచ్చజెప్పేందుకు ఇప్పటికే రేవంత్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు చెబుతున్నారు.
గతంలో కాంగ్రెస్‌కు హుజురాబాద్ నియోజకవర్గంలో 60వేల ఓట్లు వచ్చాయి. అయితే అప్పుడు పార్టీ తరుపున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ తరుపున టికెట్ ఆశించిన ఆయన… ఆ పరిస్థితి లేకపోవడంతో టీఆర్ఎస్‌తో టచ్‌లోకి వెళ్లారు. కాంగ్రెస్‌లో ఉంటూనే టీఆర్ఎస్‌తో టికెట్ కోసం సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో ఆయన ఫోన్ కాల్ ఆడియో లీకవడం పెద్ద సంచలనమే రేపింది. ఆ తర్వాతి పరిణామాల్లో ఆయన టీఆర్ఎస్‌లో చేరగా ఎమ్మెల్సీ పదవి దక్కింది. మరోవైపు కౌశిక్ రెడ్డి కాకుండా కాంగ్రెస్‌కు అక్కడ మరో అభ్యర్థి లేకుండా పోయారు. దీంతో అభ్యర్థి కోసం ఆ పార్టీ తీవ్రంగా అన్వేషిస్తోంది.