Huzurabad Elections

 

రాష్ట్ర రాజకీయలనే మార్చేసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక

 

షెడ్యూల్ విడుదలతో వేడెక్కిన  రాష్ట్ర రాజకీయం

* రాష్ట్ర రాజకీయాలను మార్చిన ఉప ఎన్నిక
* ఏకంగా ముగ్గురు మంత్రులకు ఉప ఏన్నిక భాద్యత – నియోజక వర్గంలోనే మకాం
* అధికార దుర్వినియోగం – నిధుల ప్రవాహం
* దళిత బందు గట్టెక్కిస్తుందా.?
* అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్
* వ్యూహత్మకంగా ఎన్నికల షెడ్యూల్

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) రాష్ట్రం లోని హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలతో రాజకీయాలు వెడెక్కాయి. అక్టోబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా నామినేషన్ దాఖలుకు అక్టొబర్ 8, ఉప సంవసంహరణకు అక్టోబర్ 13 గా పేర్కొంది. 30 ఎన్నికలు నిర్వహించ నుండగా నవంబర్ 2న ఫలితాలు వెలువడ నున్నాయి.

రాష్ట్ర రాజకీయాలను మార్చిన ఉప ఎన్నిక..

హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు చివరి అంకానికి చేరుకుంది. ముప్పై రోజుల ప్రణాళికతో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈటల రాజేందర్ రాజీనామా తో అనివార్యంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికల రాష్ట్ర రాజకీయాలనే మార్చివేసింది. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు హుజూరాబాద్‌ను కైవసం చేసుకునేందుకు తీవ్ర పోరును కొనసాగిస్తున్నాయి. దీంతో గతంలో ఏ ఉప ఎన్నికలకు లేనట్టుగా ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ నియోజకవర్గంలో నేతలను మోహరించి పోటాపోటిగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈటల రాజేందర్ పాదయాత్ర చేయగా అధికార టీఆర్ఎస్ ఏకంగా ముగ్గురు మంత్రులను రంగంలోకి దింపింది. మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్‌తోపాటు గంగుల కమలాకర్‌లు నియోజకవర్గంలోనే మకాం వేసి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అదనంగా ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నాయకుల మోహరింపు , కుల సంఘాల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అదనంగా సీఎం కేసీఆర్ సైతం ఎన్నికల ముందే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ లో పర్యటించారు. సుమారు రెండు వేల కోట్లను కేటాయించి పథకాన్ని ప్రారంభించారు.

ఆధికార దుర్వినియోగం – నిధుల ప్రవాహం..

ఇదిఇలా ఉండగా మరోవైపు మంత్రులు నియోజవర్గం లోని పలు సమస్యలపై దృష్టి సారించారు. నియోజకవర్గం లోని అడిగిన అన్ని కులాలకు స్థలాలు, భవనాలకు నిధుల కేటాయింపులు చేశారు. మరోవైపు మంత్రి కేటీఆర్ సైతం మున్సిపల్ శాఖ పరంగా ఉన్న సమస్యలను తీర్చేందుకు నిధులు విడుదల చేశారు. దీంతో జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటిలకు కావాల్సిన నిధులను అందించారు. ఇక నియోజకవర్గం తో పాటు కరీంనగర్ జిల్లా కేంద్రం అభివృద్ది కూడ నిధులు విడుదల చేశారు.

పదవుల పందేరం – నేతల చేరిక..

అభివృద్దితోపాటు నేతలకు పదవులు కూడా ఆ పార్టీ కట్టబెట్టింది. బీసీ అభ్యర్థి అయిన గెల్లు శ్రీనివాస్‌ను రంగంలోకి దింపడంతో పాటు ఎస్సీలను ఆకట్టుకునేందుకు దళిత బంధును తీసుకువచ్చింది. జిల్లాకు చెందిన రసమయి బాలకిషన్‌కు సంస్కృతిక సారధి చైర్మన్‌గా మరోసారి పొడిగించారు. నియోజక వర్గానికి చెందిన బండ శ్రీనివాస్‌ను ఎస్సి కార్పేరేషన్ చైర్మన్‌గా నియమించారు. దీంతోపాటు ఆయా పార్టీల్లో ఉన్న సీనియర్ నేతలను సైతం టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డి, బీసీ వర్గానికి చెందిన టీడిపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు బీజేపీ నుండి ఇతర నేతలను సైతం పార్టీలోకి ఆహ్వానించారు.

దళిత బంధు గట్టెక్కించేనా..

నియోజకవర్గం లోని 20 వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా దళిత బంధును ప్రభుత్వం తీసుకువచ్చింది. లబ్ధిదారుల ఎంపిక కూడ పూర్తయి వారి ఖాతాల్లోకి డబ్బులు కూడా చేరాయి. దీంతో కొంతమంది లబ్ధిదారులు వాటి ప్రయోజనాలు కూడ పొందుతున్నారు. అయితే 40వేల ఓట్లు ఉన్న దళిత వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని నేరుగా ప్రభుత్వ పథకం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ పథకం పై మొదట్లో విమర్శలు వచ్చినా దళితుల స్కీం కావడంతో విపక్షాలు సైతం మద్దతిస్తు నియోజకవర్గంలో అమలుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి.

నియోజకవర్గంలోనే ఈటల మకాం..

ఇక ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత నియోజవర్గం లోనే మాకం వేసి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అయితే అనారోగ్య కారణాలతో దాన్ని విరమించినా నిత్యం నియోజకవర్గంలోనే ఉంటూ ఆయన భార్య జమున తో పాటు ఈటల రాజేందర్ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు . ముఖ్యంగా ఈటల రాజేందర్ ప్రచారానికి ఆయన చేసిన అభివృద్దితో పాటు ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న దళిత బంధు లాంటి పథకాలు తన రాజీనామా తో వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు బీజేపీ అగ్రనాయకులతో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు

అభ్యర్థిని ప్రకటించని కాంగ్రేస్..

నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు హోరాహోరి పోరాడుతుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉప ఎన్నికను లైట్‌గా తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నిక తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి కసరత్తు చేస్తున్నా హుజూరాబాద్ పై మాత్రం పెద్దగా ఫోకస్ చేయలేదు. అయితే వరంగల్‌కు చెందిన కొండా సురేఖను అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తున్నా నేటి వరకు స్పష్టత ఇవ్వలేదు. కొండా సురేఖ పోటి చేయడం ద్వార అటు పద్మశాలిల ఓట్లతోపాటు మున్నూరు కాపుల ఓట్లను ఆకర్షించ వచ్చనే నేపథ్యంలో నే దీటైన అభ్యర్థిగా ఆమెను దింపాలని పార్టీ నిర్ణయించింది. అయితే ఆ పార్టీ సైతం రెండు మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వ్యుహత్మకంగా ఎన్నికల షెడ్యుల్..

ఈటల రాజీనామా చేసిన వెంటనే షెడ్యుల్ విడుదల చేస్తారని భావించిన  కోవిడ్ ప్రభావంతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయా రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరింది. దీంతో బీజేపీ ఎన్నికల నిర్వహాణకు అభ్యంతరం చెప్పకపోయినా అధికార టీఆర్ఎస్ మాత్రం కోవిడ్ ఉన్న దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలని కోరింది. దీంతో ఎన్నికల సంఘం వెనక్కి తగ్గింది. తాజాగా రాజీనామా చేసి నాలుగు నెలలు గడుస్తుండడంతో ఉప ఎన్నిక షెడ్యుల్ అనివార్యంగా విడుదల చేశారు.