Manishini Daivaniki Daggara Chese Sadhane Shivaratri Paramartham

మనిషిని దైవానికి దగ్గర చేసే సాధనే శివరాత్రి పరమార్థం

Manishini Daivaniki Daggara Chese Sadhane Shivaratri Paramartham

శివరాత్రి ఓ పండుగ మాత్రమే కాదు. సరదాగా కాలక్షేపం చేసే సమయం అంతకన్నా కాదు. మనిషిని దైవానికి దగ్గర చేసే సాధన. అందుకే మిగతా పండుగల్లా పిండి వంటలు ఉండవు. ఈ రోజు సర్వాంతర్యామి అయిన పరమేశ్వరునిపై మనస్సును లగ్నంచేసి శరీరాన్ని నిరాహారంగా ఉంచే ఉపవాసంతో జాగరణ చేస్తారు.

శివరాత్రి ప్రత్యేకత..

కొన్ని వేల సంవత్సరాల నుండే శివరాత్రి పర్వదినాన్ని ఆచరిస్తున్న సందర్భాలు చరిత్రలో కనిపిస్తాయి. శివరాత్రి పర్వదినం వెనుక రకరకాల పురాణగాథలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది శివరాత్రి రోజున పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించాడనే ఐతిహ్యం. బ్రహ్మ విష్ణువులకు తమలో ఎవరు గొప్ప అనే వివాదం చెలరేగినప్పుడు, శివుడు ఒక లింగరూపంలో ఏర్పడ్డాడట. తన ఆద్యంతాలను ఎవరైతే కనుగొంటారో వాళ్లే గొప్ప అని చెప్పాడట. సహజంగానే ఈ సమస్యను ఎవరు పరిష్కరించ లేకపోయారు. పోలికలు, పరిమితులకు అతీతమైన దైవత్వం గురించి లోకానికి చాటిచెప్పడమే లింగోద్భవం ఉద్దేశంగా చెబుతారు. ఈ గాథలో మరో ఆధ్యాత్మిక కోణం ఉంది. కొంతమంది పరమాత్మను నిరాకారునిగాను, మరికొందరు సాకార రూపంలోను ధ్యానిస్తుంటారు.

అనంతమైన లింగరూపంలో ఉద్భవించిన శివుడు తాను సర్వవ్యాపినని తేల్చిచెప్పాడు. ఈ విశ్వంలో ఆది, అంతం లేదు కాబట్టి అందులో ప్రతి చోటు ముఖ్యభాగంగా ( సెంటర్ అప్ యూనివర్స్గా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీనిలో దైవం అనే భావన కూడా అంతే. ఎలా అనుకుంటే అలాగే, ఎక్కడ చూడదల్చుకుంటే అక్కడే శివరాత్రి నాటి అర్ధరాత్రి వేళను లింగోద్భవ కాలంగా భావించి ఆ సమయంలో విశేష అభిషేకాలు, పూజలు చేస్తుంటారు. శివపార్వతుల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే అన్నది మరో గాథ. శివుడు పురుషుడు, పార్వతి ప్రకృతికి ప్రతీక. యోగశాస్త్రంలో ప్రాణి, జీవం రెండు కలిసి ఉన్నప్పుడే సృష్టి ముందుకు నడుస్తుంది.

శివపార్వతులు, అర్ధనారీశ్వర రూపంలో కనిపించడం వెనుక ఉన్న తత్వం ఇదే. శివరాత్రి పండుగ యావత్తు మనః ప్రధానంగా సాగుతుంది. బాహ్యమైన ఖర్చులు, ఆడంబరాలతో పనిలేదు. విభూదే అలంకారం, బిల్వపత్రాల అర్చన, నీటితో అభిషేకం. పరమ శివున్ని ఆరాధించేందుకు ఇంతకంటే సులభమైన క్రతువు మరొకటి లేదు. అందుకే ఈ శివరాత్రి సందర్భాన్ని సద్వినియోగం చేసుకొని ఉపవాసం, జాగరణ, అభిషేకాలతో ఆ భక్త సులభుని అనుగ్రహాన్ని పొందవచ్చు.

శివరాత్రి రోజు ఏం చేయాలి..

ఓ వేటగాడు అడవి నుండి ప్రయాణిస్తు దారితప్పి పోయాడు. రోజంతా తిండి లేక కడుపు నకనకలాడిపోతోంది. ఆ రాత్రి తలదాచుకునే చోటు లేక, ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఓ పక్క ఆకలి, మరోపక్క క్రూరమృగాల భయం. ఏం చేయాలో తోచని స్థితిలో తన చుట్టు ఉన్న ఆకులు తెంపి కింద పడేయడం మొదలుపెట్టాడు. అలా రాత్రంతా నిద్ర లేకుండానే గడిపాడు. మర్నాడు ఉదయమే ఇంటికి వెళ్లేసరికి, భార్య ఆందోళనతో ఎదురు వచ్చింది.

తన భర్తకి ఏమయ్యిందా అనే ఆతృతతో తను కూడా నిద్రపోలేదు ఆశ్చర్యం. వాళ్లిద్దరు చనిపోయిన తర్వాత శివసన్నిధికి చేరుకున్నారు. కారణం ఆ వేటగాడు జాగరణ చేసిన రోజు మహశివరాత్రి, తను తెంపి కింద పడేసినవి బిల్వ పత్రాలు. ఆ చెట్టు కింద ఉన్నది సాక్షాత్తు శివలింగం. ఇలాంటి ఐతిహ్యాలు వినడానికి కాస్త అతిశయోక్తిగా తోచవచ్చు కానీ భగవంతుడు తల్చుకుంటే మన కర్మఫలం అంతా కూడా గడ్డిపోచల దగ్ధం అయిపోతుంది. సాక్షాత్తు రమణమహర్షి వంటి పెద్దలు చెప్పిన మాటే ఇది, కొంత పూర్వజన్మ సుకృతంతోడై ఉండవచ్చు.

Also Read : దశ మహావిద్యా సాధన విధి

ఈ కథను చెప్పుకోవడానికి కారణం శివరాత్రి రోజు మనసుని పరమేశ్వరుని మీద లగ్నం చేసి, పెద్దలు సూచించిన పద్ధతులను పాటిస్తే ఎవరైనా ఆయన అనుగ్రహాన్ని పొందగలరని గుర్తుచేసుకోవడమే. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చే శివరాత్రికి ఉపవాస దీక్ష చేయాలనేది ఆచారం. ఆరోగ్యపరమైన సమస్యలు లేనివారు ఈ విధిని ఆచరించవచ్చు. ఆకలిని తట్టుకోలేనివారు. పండ్లు, పాలతో (ఉడికించని పదార్ధాలు) ఉపవాసం చేయవచ్చు. shivalingam

త్రయోదశి రాత్రి నుంచే ఈ ఉపవాసం మొదలు పెట్టి, శివరాత్రి ఉదయాన్నే తలార స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. ఆ రోజంతా ఉపవాసాన్ని కొనసాగిస్తు, రాత్రివేళ జాగరణ చేయాలి. జాగరణ సమయంలో లౌకికమైన విషయాల గురించి చర్చ, కాలక్షేపం కాకుండా శివధ్యానం, శివనామస్మరణతోనే కాలం గడపాలన్నది పెద్దలు సూచన. ఆ రాత్రివేళ ముఖ్యంగా అర్థరాత్రి సమయంలోని లింగోద్భవ సమయంలో శివుని అభిషేకించాలి.

శివుని త్రిశూలాన్ని పోలి ఉండే అరుదైన బిల్వపత్రాలతో ఆయన్ను పూజించాలి.. బిల్వపత్రాలు ఎలాంటి వాతావరణాన్నయినా తట్టుకుని మనుగడ సాగిస్తాయని చెబుతారు. పైగా తులసి తర్వాత ఆ స్థాయి ఔషధ విలువలు ఉన్న పత్రం ఇదే. అంతేకాక చీకటిలో ఉండే శివాలయాల్లో ఎలాంటి సూక్ష్మక్రిములు దరిచేరకుండా చేయగల యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న పత్రం ఇది. శివరాత్రి జాగరణ తర్వాత మర్నాడు ఉదయం వేళ పరమేశ్వరుని ధ్యానిస్తు ఉపవాసాన్ని విరమించుకోవాలి. మొత్తానికి ఉపవాసం, జాగరణ, శివనామస్మరణ, అభిషేకం, బిల్వపత్రాలతో అర్చన ఈ అయిదింటితో పరమేశ్వరున్ని ప్రసన్నం చేసుకోవాలి.