వైద్య విద్యా విధానం వ్యాపారంగా మారుతోంది – సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) దేశంలో వైద్య విద్య, వైద్య వృత్తి వ్యాపారంలా మారిపోయాయని , ఇప్పుడు వైద్య విద్య నియంత్రణ కూడా అదే తీరులోకి రావడం జాతీయ విషాదమని సుప్రీం కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ తీరు దేశానికి మంచిది కాదని కోర్టు అభిప్రాయ పడింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ సూపర్ స్పెషాలిటీ పరీక్ష 2021కు నోటిఫికేషన్ వెలువడిన తరువాత సెలబస్ మార్చడాన్ని సవాలు చేస్తూ కొందరు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసుపై విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరు సరిగా లేదని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను సరి చేసేందుకు ఒక అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. మార్చిన సెలబస్‌ను వెనక్కు తీసుకోవాలని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ డి.వై చంద్రచూడ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బుధవారం కల్లా సరైన విధానంతో కోర్టు ముందుకు రావాలని నేషనల్ బోర్డు ఎక్జామినేషన్ ను జాతీయ వైద్య కమిషన్‌ను ఆదేశించింది. వైద్య అభ్యర్థులకు నష్టం కలిగించకూడదని విచారణ కొనసాగిస్తున్నామని కోర్టు తెలిపింది.
ఏమిటీ కేసు..
కొందరికి లబ్ది చేకూర్చే విధంగా నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్ష సెలబస్ మార్చారని 41 మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కేవలం మూడు నెలల ముందు పరీక్ష సెలబస్‌లో మార్పులు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీని ద్వారా ఇబ్బంది పడుతున్నామని పిటిషన్ దారులు పేర్కొన్నారు. కొందరికి లబ్ధి చేకూర్చేందుకే సెలబస్ మార్చురు అనే అనుమానం తలెత్తుందని వారు అభిప్రాయ పడ్డారు. ఏదైనా మార్పులు ఉంటే ముందుగానే సూచించాలని లేని పక్షం అకస్మాత్తుగా పరీక్షకు సన్నద్దం అవ్వడం కష్టంగా ఉంటుందని వారు కోర్టుకు తెలిపారు. వీరి పిటిషన్ స్వీకరించి వాదనలు విన్న అనంతరం కోర్టు ప్రభుత్వం వాదనలు వింది. దీనిపై కేంద్రం తరుపున వాదించడానికి అదనపు సొలిసిటరీ జర్నల్ ఐశ్వర్య భారతీ వాదించారు. ప్రేవేటు కళాశాలల్లో సీట్లు భర్తీ చేసేందుకు సెలబస్ మార్చారనే అభిప్రాయానికి కోర్టు రావడం సరికాదని ఆమె కోరారు. వారి వివరణపై కోర్టు సంతృప్తి చెందలేదు. దేశంలో వైద్య విద్య, వైద్య వృత్తి వ్యాపారంలా మారిపోయాయని , ఇప్పుడు వైద్య విద్య నియంత్రణ కూడా అదే తీరులోకి రావడం జాతీయ విషాదమని సుప్రీం కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ తీరు దేశానికి మంచిది కాదని కోర్టు అభిప్రాయ పడింది. పరీక్షకు కేవలం మూడు నెలల ముందు సెలబస్ మార్చడం వల్ల వైద్య విద్యార్థులకు కలిగే ఇబ్బందులను అధికారులు గుర్తించాలని సూచించింది. వైద్య విద్య కోర్సులంటే ఒకటి రెండు నెలలు చదివేది కాదని పేర్కొంది.