Upagraha Diksuci Ranganiki Mahardasa

ఉపగ్రహ దిక్సూచి రంగానికి మహర్దశ

Upagraha Diksuci Ranganiki Mahardasa

 

*సరికొత్త విధానానికి కేంద్రం రూపకల్పన 
*‘శాట్‌నావ్‌’ ముసాయిదా సిద్ధం

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) భారత ఉపగ్రహ ఆధారిత దిక్సూచి, ఆగ్‌మెంటేషన్‌ సేవల రంగం ఇక కొత్త పుంతలు తొక్కనుంది. ఈ రంగంలోని వ్యవస్థల అభివృద్ధి, నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొస్తోంది. ఇండియన్‌ శాటిలైట్‌ నేవిగేషన్‌ పాలసీ (శాట్‌నావ్‌ పాలసీ-2021) పేరిట ఒక ముసాయిదాను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వెబ్‌సైట్‌లో పెట్టింది. దీనిపై ప్రజల నుంచి సలహాలు, సూచనలను కోరుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కేంద్ర కేబినెట్‌ అనుమతి కోసం దీన్ని ఉంచుతారు. అంతరిక్ష ఆధారిత దిక్సూచి వ్యవస్థలు అందించే పొజిషన్, వెలాసిటీ, టైమ్‌ (పీవీటీ) సేవలను పొందుతున్న వినియోగదారుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. సమాచార, మొబైల్‌ ఫోన్‌ సాంకేతికత రాకతో కోట్ల మంది భారతీయులు తమ రోజువారీ జీవితంలో పీవీటీ సేవలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్స్‌ (జీఎన్‌ఎస్‌ఎస్‌) అంతరిక్ష ఆధారిత నేవిగేషన్‌ సంకేతాలు అందిస్తున్నాయి.

Also Read : Covid-19: What are delta, delta plus, lambda variants…? 

ఇందులో జీపీఎస్‌ (అమెరికా), గ్లోనాస్‌ (రష్యా), గెలిలీయో (యూరోపియన్‌ యూనియన్‌), బెయ్‌డో (చైనా) వ్యవస్థలు భాగంగా ఉన్నాయి. వీటికితోడు భారత్‌కు చెందిన నావిక్, జపాన్‌కు చెందిన క్యూజడ్‌ఎస్‌ఎస్‌లు ప్రాంతీయ స్థాయిలో సేవలు అందిస్తున్నాయి. ఈ నేవిగేషన్‌ సంకేతాలు ఉచితంగా అందుతున్నాయి. గగనతలం, సముద్రం, నేలపై అనేక రంగాల్లో ఇవి ఉపయోగపడుతున్నాయి. ఇవి కాక వ్యూహాత్మక అవసరాల కోసం భద్రమైన నేవిగేషన్‌ సంకేతాలు ఆయా దేశాల్లో లభిస్తున్నాయి. భారత వ్యూహాత్మక అవసరాలను తీర్చేందుకు ‘నావిక్‌’ను అభివృద్ధి చేసినట్లు తాజా ముసాయిదా పత్రం పేర్కొంది. ఇవి కాక ఉపగ్రహ ఆధారిత ఆగ్‌మెంటేషన్‌ వ్యవస్థ (ఎస్‌బీఏఎస్‌)లు దిక్సూచి ఉపగ్రహ సమూహ సేవలను మరింత మెరుగుపరుస్తున్నాయి. మన దేశ గగనతలం కోసం ‘గగన్‌’ పేరుతో ఇలాంటి ఎస్‌బీఏఎస్‌ను ప్రభుత్వం రూపొందించింది.

ముసాయిదాలోని ముఖ్యాంశాలివీ.. 

*ఉపగ్రహ ఆధారిత దిక్సూచి, ఆగ్‌మెంటేషన్‌ సేవల్లో స్వయం సమృద్ధి సాధించాలి. నాణ్యమైన సేవల లభ్యత, వినియోగాన్ని పెంచాలి. పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించే చర్యలను చేపట్టాలి.

*అంతరిక్ష ఆధారిత నేవిగేషన్‌/ ఆగ్‌మెంటేషన్‌ వ్యవస్థ ప్రజా ఆస్తి. అది వినియోగదారులందరికీ అందుబాటులో ఉండాలి. ఇలాంటి జాతీయ మౌలిక వసతులను ప్రభుత్వం మాత్రమే అందించగలదు.

* ప్రభుత్వం తెచ్చిన ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ కింద నావిక్, గగన్‌ సేవలను కొనసాగించడానికి, సాంకేతిక పురోగతికి అనుగుణంగా మెరుగుపరచడం అవసరం. పౌర అవసరాల కోసం ఉచిత సేవలు, వ్యూహాత్మక అవసరాల కోసం నిర్దేశిత ప్రాంతంలో భద్రమైన సేవలు ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగేలా చూడాలి.