KCR

కొత్త పార్టీ పెడతాం… బీజేపీని గద్దె దించుతాం

— ప్రధాని మోదీపై కేసీఆర్ ఆరోపణలు

🔹మీటర్లు, విద్యుత్ సంస్కరణలు.. విరాళాలిచ్చేది కార్పోరేట్ల కోసమే
🔹మోదీ పాలన అవినీతి కంపు..
🔹రాఫెల్‌ డీల్‌లో కుంభకోణం, సుప్రీం కోర్టుకెక్కుతాం
🔹కాంగ్రెస్‌కు మద్ధతివ్వను.. హిమంతను అంత తేలిగ్గా వదలను
🔹బీజేపీకి కేసీఆర్ అల్టీమేటం
🔹ఢిల్లీలో ‘‘కీ’’ రోల్ నాదే..  
🔹త్వరలోనే మమత, ఉద్ధవ్‌లతో భేటీ
🔹జాతీయ రాజకీయాలపై కేసీఆర్

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆదివారం ప్రగతి భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటన్నారు. మోదీ అబద్ధాలు ఎక్కువగా చెబుతున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. మోదీ వల్ల దేశం ఎంత నాశనమవుతుందో వివరిస్తూ ఎంతోమంది పుస్తకాలు రాస్తున్నారని కేసీఆర్ దుయ్యబట్టారు. విద్యుత్ సంస్కరణలపైనా అబద్ధాలే చెబుతున్నారని సీఎం ఆరోపించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాల్సిందేనని ముసాయిదా బిల్లులో ప్రస్తావించారని కేసీఆర్ దుయ్యబట్టారు. మోదీ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించారని… పార్లమెంట్‌లో ఆమోదం పొందకముందే బిల్లును అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఏపీలో ఇప్పటికే కొన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టారని.. మీటర్లు పెడుతున్న రాష్ట్రాలకు 0.5 శాతం ఎఫ్ఆర్‌బీఎం అదనంగా ఇస్తామంటున్నారని కేసీఆర్ తెలిపారు. మీటర్లు పెట్టమనకుండానే జగన్‌మోహన్ రెడ్డి పెట్టారా అని సీఎం ప్రశ్నించారు. తెలంగాణలో విద్యుత్ సంస్కరణలు అమలు చేయట్లేదని వచ్చే డబ్బులు కూడా ఆపేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి ఇవేమీ తెలియదని.. రాష్ట్రానికి 25 వేల కోట్ల నష్టం వస్తుందని తెలిసినా, తాను మీటర్లు పెట్టలేదని సీఎం వెల్లడించారు. మిషన్ భగీరథ ప్రారంభ సభలోనూ మోదీ అబద్ధాలే చెప్పారంటూ కేసీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణకు యూనిట్ రూ.1.10కే ఇస్తున్నట్లు మోడీ చెప్పారని.. నా పక్కనే నిలబడి మోదీ అబద్ధం చెబుతున్నా మర్యాద కోసం తాను మాట్లాడలేకపోయానని కేసీఆర్ గుర్తుచేశారు. అసలు ఎప్పుడైనా తెలంగాణకు యూనిట్ రూ.1.10కే విద్యుత్ ఇచ్చారా అని మోదీ సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. 40 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం పూర్తయినా కరెంట్ ఉత్పత్తి చేయనివ్వడం లేదని.. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విద్యుత్ విధానం వల్లే ఈ పరిస్ధితి వచ్చిందని కేసీఆర్ ఆరోపించారు. బీజేపీలో ప్రతి ఒక్కరూ అబద్ధాలే చెబుతున్నారని.. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. శ్రీశైలం, సాగర్‌లో జల విద్యుత్ ఉత్పత్తిని ఆపేసి అయినా సరే.. సౌర విద్యుత్ కొనాలని ఒత్తిడి చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి, బీజేపీకి విరాళాలు ఇచ్చే వాళ్ల దగ్గరి నుంచి సౌర విద్యుత్ కొనిపించాలని చూస్తున్నారని సీఎం ఆరోపించారు. 12 శాతం వృద్ధి వుంటే ఎక్కడైనా ఆరేళ్లలో రెట్టింపు అవుతుందని.. దానికి మోడీ అవసరం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 2025 నాటికి 5 లక్షల కోట్ల ఆర్ధిక వృద్ధికి ప్రధాని, ఆర్ధిక మంత్రి అవసరం లేదని సహజంగా జరిగేదే అని సీఎం పేర్కొన్నారు. చేతనైతే చైనాలాగా, సింగపూర్‌లాగా చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. మోదీకి ఇచ్చిన టైమ్‌లో 80 శాతం అయిపోయిందని.. కిషన్‌రెడ్డి కూడా అలా మాట్లాడటం ధర్మం కాదన్నారు. బడ్జెట్ కేసీఆర్‌కు అర్ధం కాలేదని కిషన్‌రెడ్డి అంటున్నారని.. ఆయనకేం అర్ధమైందో, తనకు అర్ధం కావడం లేదంటూ కేసీఆర్ దుయ్యబట్టారు. మాకు అర్ధమయ్యే మీ రంగు బయటపెట్టామని, 40 కోట్లమంది దళితులకు 12 వేల కోట్లు కేటాయించింది నిజం కాదా అని సీఎం ప్రశ్నించారు. అన్నీ అమ్మేస్తున్నారని.. ఇప్పుడు విద్యుత్ అమ్మడానికి సిద్ధమయ్యారని కేసీఆర్ ఆరోపించారు. డిస్కమ్‌లను ప్రైవేట్‌పరం చేయాలనుకోవడం చాలా దారుణమన్నారు. విద్యుత్ ప్రైవేట్‌పరమైతే ఇబ్బడిముబ్బడిగా ఛార్జీలు పెరిగి జనం చస్తారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.మోదీ పాలన అవినీతి కంపు అని.. అంతర్జాతీయ మీడియా కూడా ఇదే చెబుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వ అవినీతిపై సుప్రీంకోర్టులో కేసు వేస్తామని.. ప్రజాకోర్టులోనూ తేల్చుకుంటామని కేసీఆర్ తెలిపారు. రాఫెల్ కుంభకోణం బయటికి రావాలని.. అందులో దొంగలు బయటపడాలని సీఎం కోరారు. రాష్ట్రంలో వివిధ వర్గాలకు ఇస్తున్న సబ్సిడీ విద్యుత్‌ను ఆపేయాలంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డికి ఇప్పుడు మర్యాదగా చెబుతున్నానని.. ఇకపై గట్టిగా చెప్పాల్సి వస్తుందని సీఎం వార్నింగ్ ఇచ్చారు. దేశ సంపదను దోచుకుని విదేశాలకు పారిపోయిన వాళ్లంతా మోదీ దోస్తులేనని కేసీఆర్ ఆరోపించారు. బండి సంజయ్ నుంచి మోదీ వరకు అందరూ అబద్ధాలు చెబుతున్నారని సీఎం మండిపడ్డారు. క్లీన్ ఎనర్జీ కింద కేంద్రం ఇచ్చే విద్యుత్ కొనాలన్నారు. మన దగ్గర వున్న విద్యుత్ ఏం కావాలని కేసీఆర్ ప్రశ్నించారు. వ్యాపారస్తుల కోసం రాష్ట్రాలపై భారం వేస్తారా అని ఆయన మండిపడ్డారు. ఎన్నాళ్లు అబద్ధాలతో నడిపిస్తారన్న ఆయన.. బీజేపీని తరిమికొట్టకపోతే దేశం నాశనమవుతందని కేసీఆర్ జోస్యం చెప్పారు. ఇదా మీ దేశ భక్తి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే అంటున్నా.. బీజేపీ మస్ట్ గో అంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు. దమ్ముంటే తనను జైల్లో వేయాలని.. జైలంటే దొంగలకు భయమని, తమకేం భయం లేదని సీఎం స్పష్టం చేశారు. 77 శాతం దేశ సంపద 10 శాతం మంది దగ్గరే వుందని.. ధనికులు ఇంకా ధనికులవుతున్నారని, పేదలు మరింత పేదలవుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని.. వాట్సాప్ యూనివర్సిటీతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. పేదలకు సబ్సిడీ ఎత్తేసి.. దొంగలకు సద్ది కట్టాలి, ఇది కేంద్రం తీరని సీఎం దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో 33 మంది బ్యాంకులను ముంచి పారిపోయారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో ఈ విషయాన్ని స్వయంగా బీజేపీ ప్రభుత్వమే చెప్పిందని సీఎం తెలిపారు. ఈడీ పెడతాం, సీబీఐ పెడతాం అని బెదిరిస్తున్నారని … ఎన్నికల్లో గెలవకపోయినా పరిపాలన చేసే సిగ్గులేని పార్టీ బీజేపీ అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ పరువు పోలేదా అని ఆయన గుర్తుచేశారు. రాఫెల్‌పై రాహుల్ మాట్లాడితే ఆయనపై ఎదురుదాడి చేశారని కేసీఆర్ మండిపడ్డారు. ప్రధానికి క్షమాపణ చెప్పడం అలవాటేనని.. ప్రధాని అయితే గోద్రా తరహా అల్లర్లు జరుగుతాయా అని అడిగితే, ముస్లింలకు మోడీ క్షమాపణ చెప్పారని సీఎం గుర్తుచేశారు.  క్షమాపణ రాజకీయాలు మోడీకి అలవాటేనని.. బుద్ధి వున్న ఏ ప్రధాని అయినా వేరే దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకుంటారా అంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. కర్ణాటకలో ఏం జరుగుతుందో చూడాలన్న ఆయన.. కాలేజీల్లో చదివే యువతకు ఏం నేర్పిస్తున్నారో చూడాలని సీఎం వ్యాఖ్యానించారు. తప్పులు ఎత్తి చూపిన ప్రతి పార్టీని అర్బన్ నక్సలైట్ అంటున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్‌ను ఉద్ధేశించి అసోం సీఎం అన్న వ్యాఖ్యలన్ని తాను తేలిగ్గా వదిలేయనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. యాదాద్రి ప్రారంభోత్సవానికి మోదీని పిలవాలో లేదో ఆలోచిస్తామన్నారు. దళిత సంఘాలకు , రాజ్యాంగానికి  సంబంధం ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా సరిహద్దుల్లో డ్రామాలు చేస్తారని.. ఈ తరహా  రాజకీయాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని కేసీఆర్ హితవు పలికారు. బీజేపీ ప్రభుత్వంలో గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని సీఎం ఆరోపించారు. తాను కాంగ్రెస్‌కు మద్ధతివ్వడం లేదని, రాహుల్ గాంధీ విషయం మాట్లాడానని కేసీఆర్ స్పష్టం చేశారు. దళితులకు 19 శాతం రిజర్వేషన్ల కోసం, ఆడపిల్లలకు ఆస్తిలో సమానహక్కు కోసం కొత్త రాజ్యాంగం రాయాలని సీఎం డిమాండ్ చేశారు. యూపీ ఎన్నికల పోలింగ్ మరుసటి రోజే పెట్రోల్ ధరలు పెరుగుతాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. కేంద్రం రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తోందని.. దీనిని అరికట్టడానికి కొత్త రాజ్యాంగం రాయాలన్నారు. దేశమంతా దళితబంధు పెట్టాలని.. దీని కోసం రాజ్యాంగం రాయాలంటున్నానని, దళిత సంఘాలు వద్దంటాయా అని కేసీఆర్ ప్రశ్నించారు. అమెరికా కన్నా గొప్ప ఆర్ధికశక్తిగా ఎదిగేందుకు కొత్త చట్టం  , కొత్త స్పూర్తి రావాలన్నారు. తెలంగాణలాగా భారతదేశం కూడా మారడానికి కొత్త రాజ్యాంగం రావాలంటున్నానని సీఎం చెప్పారు.

దేశం కోసం కొత్త పార్టీ పెట్టాలని అందరూ కోరుకుంటే తప్పకుండా పెడదామని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఫ్రంట్‌లు కాదు.. ప్రజలే ఫ్రంట్‌గా ఏర్పడాలని సీఎం పిలుపునిచ్చారు. ఉద్ధవ్ థాక్రేతో చర్చించేందుకు త్వరలోనే ముంబైకి వెళ్తానని కేసీఆర్ తెలిపారు. బెంగాల్  సీఎం మమతా బెనర్జీ ఫోన్ చేశారని.. త్వరలో కోల్‌కతాకు కూడా వెళ్తానని ఆయన పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో తప్పకుండా ప్రధాన పాత్ర నాదే వుంటుందని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగా అన్ని పార్టీలు ఐక్యం కావాలని.. అందరం కలిసి బీజేపీని  ఇంటికి పంపాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మాపై కూడా విచారణ జరగాలని.. అప్పుడే ఎవరేంటో తెలుస్తుందని, పవిత్రంగా ఎవరున్నారో తెలుస్తుందని సీఎం అన్నారు. మనకు పార్టీ పెట్టే దమ్ము లేదా అని కేసీఆర్ పిలుపునిచ్చారు. మోదీకి స్వాగతం పలికేందుకు తాను వెళ్లలేదని ఎవరెవరో ఏమేమో మాట్లాడారని  సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్వరం కారణంగానే తాను మోదీకి స్వాగతం పలికేందుకు వెళ్లలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ గాంధీ సాక్ష్యాలు అడగడంలో తప్పు లేదని.. తాను కూడా అడుగుతున్నానని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్షనేతగా, ఎంపీగా అడిగే హక్కు రాహుల్ గాంధీకి వుందని కేసీఆర్ స్పష్టం చేశారు. దళితులకు 19 శాతం రిజర్వేషన్ల కోసం, ఆడపిల్లలకు ఆస్తిలో సమానహక్కు కోసం కొత్త రాజ్యాంగం రాయాలని సీఎం డిమాండ్ చేశారు. యూపీ ఎన్నికల పోలింగ్ మరుసటి రోజే పెట్రోల్ ధరలు పెరుగుతాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. కేంద్రం రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తోందని.. దీనిని అరికట్టడానికి కొత్త రాజ్యాంగం రాయాలన్నారు. దేశమంతా దళితబంధు పెట్టాలని.. దీని కోసం రాజ్యాంగం రాయాలంటున్నానని, దళిత సంఘాలు వద్దంటాయా అని కేసీఆర్ ప్రశ్నించారు. అమెరికా కన్నా గొప్ప ఆర్ధికశక్తిగా ఎదిగేందుకు కొత్త చట్టం  , కొత్త స్పూర్తి రావాలన్నారు. తెలంగాణలాగా భారతదేశం కూడా మారడానికి కొత్త రాజ్యాంగం రావాలంటున్నానని సీఎం చెప్పారు.