అమ్మవారి నవదుర్గల అవతారాల్లో ఆరో అవతారం కాత్యాయని
6. కాత్యాయని
కొత్స అనే రుషి తనకు పార్వతీమాత కుమార్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురుగా జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశంతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్ట మొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది..
“కాత్యాయనీ మాత” బాధ్రపదబహుళ చతుర్దశి (ఉత్తరభారత పంచాంగ సంప్రదాయము ననుసరించి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి) నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించింది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.
కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పడయుటకు గోకులములోని గోపికలందఱును యమునాతీరమున ఈమెను పూజించిరి. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము. బంగారు వర్ణము గలది. నాలుగు భుజములతో విరాజిల్లుచుండును. ఈమె కుడిచేతిలో ఒకటి అభయ ముద్రను, మఱియొకటి వరముద్రను కలిగియుండును. ఎడమచేతిలో ఒకదానియందు ఖడ్గము, వేఱొకదానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహన.
ఈ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్ధకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మజన్మాంతర పాపములు నశించును.
నవరాత్రుల్లో ఆరవ రోజు లేదా షష్టి రోజున దుర్గా దేవిని కాత్యాయనీ శ్రీలలితాదేవి రూపముగా అలంకరిస్తారు. ఆరోజున అమ్మవారికి నైవేద్యంగా తేనెను సమర్పిస్తారు.
కాత్యాయణీ ధ్యాన శ్లోకం :
“ చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా ।
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ॥ “