revanth

 

జోరు వానలో హోరెత్తించిన రేవంత్

 

🔹దళితుల దగా సహించం
🔹ఇంద్రవెల్లిలో తొలి అడుగేశాం
🔹మలి అడుగు మహేశ్వరంలో..
🔹 కేసీఆర్ ను గద్దె దించుతాం

 

మహేశ్వరం (ప్రశ్న న్యూస్) దారులన్నీ అటువైపే.. అందరి ఆలోచన ఒక్కటే.. కేసీఆర్ ను గద్దె దించడం.. కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకురావడం. మహేశ్వరం మండలం రావిర్యాల సాక్షిగా.. దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ వేదికగా.. పోటెత్తిన కాంగ్రెస్ శ్రేణుల అంతరంగం ఇది. జోరు వానను సైతం లెక్క చేయలేదు. పిడికిలి పైకెత్తి ఒక్కటే నినదించారు. కేసీఆర్ కబంధ హస్తాల నుంచి తెలంగాణ విముక్తే లక్ష్యంగా తమ పోరాటం సాగుతుందని గర్జించారు. తెలంగాణ కోసం చనిపోయిందెవరో.. ఇవాళ తెలంగాణ సంపదను దోచుకుంటున్నదెవరో ప్రజలు ఆలోచించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తెరాస పాలనలో దళిత, గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ‘దండోరా’ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండో సభ రావిర్యాలలో జరిగింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… ‘‘ తెలంగాణ ప్రజలు ఆవేశంతో ఉన్నారు. మరో 18 నెలల్లో కేసీఆర్‌ను గద్దె దించాలని ఆవేశంగా ఉన్నారు. కృష్ణానది ఉప్పొంగినట్లు కాంగ్రెస్‌ సభకు ప్రజలు వచ్చారు. సీఎం హుజూరాబాద్‌ సభకు ఎంతమంతి వచ్చారో చూశాం. కాంగ్రెస్‌ సభలు చూసి కేసీఆర్‌ గుండెల్లో గునపం దిగినట్లుంది. తెరాస ఏడేళ్ల పాలనలో దళిత, గిరిజన వర్గాలు దోపిడీకి గురయ్యాయి’’ అని విమర్శించారు. వర్షంలో తడుస్తూనే రేవంత్‌రెడ్డి తన ప్రసంగం కొనసాగించారు.

దళిత బంధు పేరుతో ఓట్ల వేటకు బయల్దేరిన కేసీఆర్‌కు హుజూరాబాద్‌ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఏడేళ్ల పాలనలో ఎస్సీలను, ఎస్సీ అధికారులను అడుగడుగునా అవమానించిన కేసీఆర్‌ .. ఎన్నికల కోసం కొత్త నాటకాలకు తెరతీశారని దుయ్యబట్టారు. దళిత బంధు కింద ఇస్తున్న రూ.10లక్షలు ఎవరి భిక్షం కాదని, ప్రజలు కట్టిన పన్నుల నుంచే ఇస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న కుటుంబాలు బాగుపడలేదని, సీఎం కేసీఆర్‌ కుటుంబం మాత్రం ప్రజల సొమ్మును దోచుకుంటోందని ఆరోపించారు. విద్య, ఉపాధి కల్పించకుండా దళితబంధు పేరుతో కొత్త మోసానికి తెరతీశారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు హుజూరాబాద్‌ ఎన్నికలు వేదిక కావాలన్న రేవంత్‌రెడ్డి.. మోసపూరిత హామీలను నమ్మి ఈ అవకాశాన్ని వదులుకోవద్దని ప్రజలను కోరారు.

అంతకు ముందు ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూములను తెరాస ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించారు. పేదలకు రూ.2నుంచి 5లక్షలు చెల్లించి భూములు లాక్కుని… వాటిని పారిశ్రామిక వేత్తలకు రూ.కోట్లకు అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌లో తప్ప ఎక్కడా దళితబంధు అడగకుండా చేస్తున్నారని విమర్శించారు. ఏడేళ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో మంత్రి కేటీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌,  సీనియర్‌ నేతలు మల్లు రవి, కోదండరెడ్డి, దాసోజు శ్రవణ్‌, అద్దంకి దయాకర్‌ తదితరులు బహిరంగ సభకు హాజరయ్యారు. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులతో రావిర్యాల జనసంద్రంగా మారింది.