తెలుగు రాష్ట్రాల జల యుద్ధం
🔹జగన్ తీరుపై కేసీఆర్ అభ్యంతరం
🔹జగన్ యాక్షన్ ప్లాన్..
🔹రాజకీయంగానూ ఇద్దరికీ కీలకం
🔹సామరస్యమా లేదా రణమా వేచి చూడాల్సిందే
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కొద్ది కాలం క్రితం వరకు సఖ్యత కొనసాగింది. ఏపీలో జగన్ సీఎం అయిన తరువాత తెలంగాణతో ఇచ్చి పుచ్చుకొనే ధోరణితోనే వ్యవహరించారు. కేంద్రానికి అవకాశం ఇవ్వకుండా ఏ సమస్య అయినా తామిద్దరమే పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ప్రగతి భవన్ కు జగన్…అమరావతికి కేసీఆర్ రాకపోకలు సాగించారు. సుదీర్ఘ భేటీలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ వెళ్లారు. కానీ, సడన్ గా ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య నాటి ఆప్యాయతలు…సఖ్యత ఇప్పుడు బయటకు మాత్రం కనిపించటం లేదు.ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పధకం పైన తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలోనూ ఏపీ ప్రభుత్వం..ఏపీ ముఖ్యమంత్రి తీరు పైన ఆగ్రహం వ్యక్తం అయినట్లు వార్తలు వచ్చాయి. నాడు వైఎస్ కంటే మొండిగా జగన్ వ్యవహరిస్తున్నానే వ్యాఖ్యలు వినిపించాయి. దీంతో.. ఏపీకి సమాధానంగా తెలంగాణ ప్రభుత్వం తమ ప్రాజెక్టులు పూర్తి చేయాలని భావిస్తోంది. దీంతో…ఇప్పుడు ఏపీ సీఎం జగన్ అప్రమత్తయ్యారు. తెలంగాణ కేబినెట్ లో జరిగిన చర్చ..వారి అడుగులు నిశితంగా పరిశీలిస్తున్న ఏపీ ప్రభుత్వం నేడు ప్రాజెక్టుల వారీగా సమీక్ష చేయనుంది.
ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా కృష్ణా నదిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా 255.93 టీఎంసీలను వాడుకునేలా ప్రాజెక్టులను కొన్నింటిని పూర్తి చేసి.. మరికొన్నింటిని నిర్మిస్తోందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూనే.. ఆంధ్రప్రదేశ్‌కు పెను నష్టం చేసేలా కృష్ణా నదిపై అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మించేందుకు సిద్ధమైన తెలంగాణ సర్కారు ప్రయత్నిస్తోందని ఏపీ ప్రభుత్వం వాదన. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ విస్తరణ పథకంలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కార్యాచరణ సిద్ధం చేయగానే.. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి, పర్యావరణ శాఖలకు.. కృష్ణా బోర్డుకు, జాతీయ హరిత ట్రైబ్యునల్ ఫిర్యా దు చేసింది. సీమ పథకం పనులు చేపట్టొద్దని జలశక్తి శాఖ ఆదేశాలు జారీచేసింది.కానీ తెలంగాణ సర్కారు మాత్రం కేఆర్‌ఎంబీకి డీపీఆర్‌లు సమర్పించకుండానే అదనంగా కృష్ణా నదిపై పలు పథకాలను నిర్మించేందుకు సిద్ధమవుతోందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఇది..రాజకీయంగానూ జగన్ కు నష్టం చేసే అవకాశం ఉంది. కేసీఆర్ తో సఖ్యత కోసం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారనే ఆరోపణలు ప్రతిపక్షాల నుండి వచ్చే ఛాన్స్ ఉంది. గతంలోనే కేసీఆర్ తో సఖ్యతగా ఉన్న సమయంలోనే ప్రతిపక్షాలు అనేక అనుమానాలు వ్యక్తం చేసాయి. దీంతో..ఇప్పుడు జగన్ తెలంగాణ ప్రాజెక్టులు ఏపీకి అడ్డుగా మారకుండా నిలువరించేందుకు… కార్యాచరణ సిద్దం చేయనున్నారు.
సామరస్యంగానే పరిష్కరించుకొనే ప్రయత్నాలు చేస్తూనే..న్యాయ పోరాటం.. కేంద్రం వద్ద అభ్యంతరాలు వ్యక్తం చేయటం వంటి అంశాల పైన ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే, ఇద్దరూ తెలుగు ప్రజలు-రైతుల ప్రయోజనాల కోసం పదే పదే ప్రస్తావిస్తున్న ఈ సమయంలో మరో సారి ఇద్దరు కలిసి ఈ సమస్యలు పరిష్కరించుకంటారా అనే చర్చ తెర పైకి వచ్చింది. అయితే, అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవని..ఇద్దరు ముఖ్యమంత్రులు దీనిని రివర్ బోర్డు లేదా న్యాయస్థానాల పరిధిలోనే తేల్చుకొనే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కేంద్రం సైతం ఈ వ్యవహారాల్లో ఎంత వరకు జోక్యం చేసుకుంటుందనే సందేహమే. దీంతో..ఈ రోజు సమావేశంలో జగన్ తీసుకోబోయే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొని ఉంది.