KCR

 

‘దళిత బంధు’తో కేసీఆర్‌కు కొత్త తలనొప్పి..

 

* హుజురాబాద్‌లో మరో డిమాండ్ తెరపైకి
* గల్ఫ్ బంధు అమలు చేయాలని డిమాండ్
* వచ్చే నెల రెండో తేదీన గల్ఫ్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం

 

హుజురాబాద్ (ప్రశ్న న్యూస్) హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హడావుడిగా ‘దళితబంధు’ పథకం ప్రకటించి నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం వల్ల హుజురాబాద్‌లో దళితుల ఓట్లు పడటం అటుంచితే ఇతర సామాజిక వర్గాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో అవసరమైతే బీసీలతో పాటు ఇతర వర్గాల వారికి పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇదే తరహాలో తెలంగాణలో మరో డిమాండ్ వినిపిస్తోంది. దళిత బంధు తరహాలోనే గల్ఫ్ వాపసీల కోసం ‘గల్ఫ్ బంధు’ అమలు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కార్మికులు ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లి తిరిగి వచ్చిన వారి కోసం ఈ పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న హుజురాబాద్ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గల్ఫ్‌ దేశాలకు వెళ్లి తిరిగొచ్చిన వారు వేలాది మంది హాజరు కానున్నారు. స్వగ్రామంలో ఉపాధి లేక ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి అప్పుల పాలైన వారిని ఆదుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని తమ సంఘం నిర్ణయించిందని నిర్వాహకులు మంద బీం రెడ్డి తెలిపారు.