దళిత బంధు.. బీసీ బంధు.. ఎన్నికలయ్యాక ‘అన్నీ బంద్’

 

🔹కేసీఆర్ దిమ్మతిరగాలన్న ఈటల రాజేందర్..
🔹నేనంటే ఎందుకంత భయం.?
🔹మంత్రులకే దొరకని సీఎం.. ఇప్పుడు ఎంపీటీసీ, సర్పంచులతో..
🔹కేసీఆర్‌కు మనిషి కాదు.. ఓటే కనిపిస్తుంది..
🔹కేసీఆర్ ను మాటలతో నిలదీసిన ఈటల

 

హుజూరాబాద్ (ప్రశ్న న్యూస్) కేసీఆర్ సర్కారుపై మరోసారి విమర్శల వర్షం కురిపించారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కారణంగానేప్రజలకు పెన్షన్లు, రేషన్ కార్డులు, గొల్ల, కురమలకు గొర్లు, దళిత బంధు వస్తున్నాయన్నారు. వీణవంక మండలం కొండపాక గ్రామంలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలను గంజిల ఈగ లెక్క తీసేసిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో దళిత బిడ్డలకు పెడుతున్న అన్నంకు కూడా కేసీఆర్ డబ్బులు ఇవ్వలేదన్నారు. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారని తెలిపారు. దళిత బంధు అన్నడు, తర్వాత బీసీల బంధు అంటడు.. ఎన్నికలైన తర్వాత అన్ని బంద్ పెడతడని కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు ఈటల రాజేందర్.

తమ నియోజకవర్గాల్లో పనులు చేయడానికి చేతకాని ఎమ్మెల్యేలు ఇక్కడకు వచ్చి అన్ని చేస్తామంటున్నారని ఈటల ఆరోపించారు. హుజూరాబాద్‌లో దెబ్బకొడితే కేసీఆర్ దిమ్మ తిరగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇన్నేళ్లు అధికారంలో ఉండి కూడా ఎవరితోనూ గొడవపడలేదని, ఏ పార్టీ జెండా కూడా పీకించలేదని ఈటల అన్నారు. కానీ, ఇప్పుడు తాను ఏ ఊరికి వెళితే ఆ ఊరులో కరెంట్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు. తాను చిన్నవాడిని అయితే ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని కేసీఆర్‌ను ఈటల ప్రశ్నించారు. ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పనిచేసిన సమయంలో అసెంబ్లీలో అందరూ శభాష్ అన్నారని ఈటల గుర్తు చేశారు. తాను ఏ పదవిలో ఉన్నా.. దానికి న్యాయం చేశానని చెప్పారు. వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలోనూ పర్యటించారు ఈటల.

మంత్రులకే దొరకని సీఎం.. ఇప్పుడు ఎంపీటీసీ, సర్పంచ్‌లతో ఫోన్లో మాట్లాడుతున్నారని అన్నారు. మన దెబ్బ అలా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు తన మీదకు వస్తున్నారని.. ఇది గడ్డి పోస కాదు.. గడ్డ పార అని అన్నారు. పోలీసులకు కూడా వారి మనసులో ఈటల రాజేందర్ గెలవాలని ఉందన్నారు. తాను అందరికీ సహాయం చేసేవాడినని, ఇప్పుడు తనకే కష్టకాలం వచ్చిందని ఈటల తెలిపారు. జెండాలు పక్కన పెట్టి.. తనను ప్రేమించిన, ద్వేషించిన వారికి కూడా పనిచేసి పెట్టానని ఈటల చెప్పుకొచ్చారు. తనకు మనిషిలో ఓటు కనపడలేదని, మానవత్వం కనిపించిందన్నారు. కానీ, కేసీఆర్‌కు మనిషి కనిపించడని.. ఓటు మాత్రమే కనిపిస్తుందన్నారు. వారి ఆలోచన కుర్చీ.. ఆశయం పవర్ అని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల కంట్లో కేసీఆర్ మట్టి కొట్టారని విమర్శించారు. అధికారంలో ఉన్నవారు ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ఈటల సూచించారు. తనకు అందరూ అండగా ఉండాలని కోరారు. కాగా, పాదయాత్రలో ఈటల రాజేందర్ అస్వస్థతకు గురికావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.