ts cm

 

హుజూరాబాద్ పై కేసీఆర్ ప్రేమ

 

🔹దుబ్బాక ఎన్నికల సీన్ రిపీట్ కాకుండా సీఎం కేసీఆర్ స్కెచ్
🔹హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన
🔹బీజేపీ మాటలు ప్రగల్భాలు మాత్రమే అంటూ ప్రచారం చేస్తున్న మంత్రులు

 

హుజూరాబాద్ (ప్రశ్న న్యూస్) హుజూరాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ రానున్న ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రత్యేకంగా దృష్టి సారించారా? మంత్రులు ఎమ్మెల్యేల పర్యటనల వెనుక ఆంతర్యం అదేనా ? హుజరాబాద్ నియోజకవర్గం లోని ప్రజలకు పలు సంక్షేమ పథకాలను అందించడం, నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఈటల రాజేందర్ కు చెక్ పెట్టడం కోసమేనా? అంటే హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు అవును అనే చెప్తున్నారు. అయితే ఈసారి సీఎం కేసీఆర్ కు ఈటల రాజేందర్ కు చెక్ పెట్టడం ఈజీ కాదని అర్థం అయిన నేపథ్యంలోనే యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణలోకి దిగినట్లుగా చర్చిస్తున్నారు. ఈ నేపధ్యంలో మంత్రుల పర్యటనలు, పథకాల పందేరం ఆసక్తికరంగా మారాయి. దుబ్బాక లో సీఎం కేసీఆర్ కు ఎదురు దెబ్బ తగిలినట్టే , హుజురాబాద్ లో కూడా సీఎం కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక ఈ విషయాన్ని గ్రహించిన కెసిఆర్ మంత్రులను రంగంలోకి దించారు. హుజురాబాద్ ప్రజలను ప్రసన్నం చేసుకోమని దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ, ప్రజలకు పలు సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు.

ఇక తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తో కలిసి పర్యటించారు. సీఎం కేసీఆర్ పేదలకు అండగా ఉంటారని , పుట్టుక నుంచి పెళ్లి వరకు , ఆపై వృద్ధాప్యంలోనూ ప్రజలందరికీ అవసరమైన అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయని, ప్రజలంతా సీఎం కేసీఆర్ కు అండగా నిలవాలని అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పలు పథకాల లబ్దిదారులకు చెక్కులు అందించిన ఎర్రబెల్లి ఆడపిల్లలకు పెళ్లి చేసి అందరికీ మేనమామ అయ్యారని సీఎం కేసీఆర్ కు కితాబిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌తి ఇంటికి ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు అందే విధంగా కృషి చేస్తున్నామ‌ని అన్నారు. ప్ర‌గ‌ల్భాలు ప‌లికే కేంద్ర ప్ర‌భుత్వం విభ‌జ‌న హామీల‌ను నెర‌వేర్చ‌కుండా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంద‌ని మండిప‌డ్డారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తున్న ఏకైక రాష్ట్ర ప్ర‌భుత్వం టిఆర్ఎస్ ప్ర‌భుత్వమ‌ని అన్నారు. బిజేపి పాలిత రాష్ట్రాల్లో పేద ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ లాంటి పథకం ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. ఇక ఎర్రబెల్లి తరహాలోనే మిగతా మంత్రుల పర్యటనలు కొనసాగుతున్నాయి. ఆసరా పెన్షన్లతో వృద్దులకు అండగా నిలిచి, గౌరవాన్ని పెంపొందించిన వ్యక్తి సియం కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు సియం కేసీఆర్ అండతో హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని విధాలుగా అభివృద్ధి జరిగిందని, ఇంకా అభివృద్ధి చేసుకునేందుకు ముఖ్యమంత్రికి ప్రజలంతా అండగా ఉండాలని ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఇక ఇదంతా రానున్న ఎన్నికల నేపథ్యంలోనే అని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలలో మాత్రం మంత్రుల పర్యటనలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.