సీఎం కేసీఆర్ చరిష్మా ఎందుకు తగ్గుతోంది.?
తెలంగాణ రాష్ట్ర సాధనలో సీఎం కేసీఆర్ ది ఓ చారిత్రత్మక పాత్ర. రాజకీయంగా ఎందరు ఎన్ని విమర్శలు చేసినా ఈ విషయంలో మాత్రం సీఎంను అందరూ మెచ్చుకుంటారు. పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడి చివరి వరకు పోరాటంలో ఉన్నారు. విజయం సాధించే వరకు వెనకడుగు వేయలేదు. 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమం ఒక ఎత్తు అయితే కేసీఆర్ వచ్చాక మరో ఎత్తు. ఇందులో ఆయన తన రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నప్పటికీ ఉద్యమంపై ఒక స్టాండ్ మాత్రం తీసుకున్నారు.
స్వరాష్ట్రానికి మొదటి సీఎం..
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి సారి సీఎం పగ్గాలు కేసీఆర్ చేపట్టారు. స్వరాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికల్లో ప్రజలు టీఆర్ ఎస్‌కు పట్టం కట్టారు. కేసీఆర్‌ను ఆశీర్వదించారు. మొదటి ఏడాదిలో కొంత కాలం పాలనపై ఆవగాహన పొందారు. అనంతరం సంక్షేమ పథకాలు, సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, ప్రాజెక్టుల రీ డైజైన్ అంటూ దూకుడుగా వ్యవహరించారు. తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 5 ఏళ్లు పూర్తి కాకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.
రెండో సారి ఆశీర్వదించిన రాష్ట్ర ప్రజలు..
ముందస్తు ఎన్నికల్లో కూడా రాష్ట్ర ప్రజలు టీఆర్ ఎస్‌కు అవకాశం కల్పించారు. ఈ విజయం కేవలం సీఎం కేసీఆర్‌ను చూసి వచ్చిందే. మీ ఎమ్మెల్యేలను చూసి ఓటు వేయకండని, తనని చూసి టీఆర్ ఎస్‌కు ఓటు వేయాలని అనేక సభల్లో కేసీఆర్ చెప్పారు. సంక్షేమ పథకాలు ప్రభావం, కేసీఆర్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ, ప్రతిపక్షాల చేతగానితనం టీఆర్ ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చేలా చేశాయి.
కేసీఆర్‌కు ఆదరణ ఎందుకు తగ్గుతోంది.?
సీఎం కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలకు ఎనలేని అభిమానం, ఆదరణ ఉంది. కానీ అది ఇటీవల తగ్గుతోంది. క్షేత్రస్థాయిలో ఏ టీఆర్ఎస్ నాయకుడు వెళ్లి గోప్యంగా సర్వే నిర్వహించినా ఈ విషయం తేటతెల్లం అవుతుంది. ఇటీవల వచ్చిన ఐఏఎన్ఎస్- సీ ఓవర్ సర్వే దీనికి బలాన్ని చేకూర్చుంది. రాష్ట్రంలో 30.3 శాతం మంది కేసీఆర్‌పై ఆగ్రహంగా ఉన్నారని ఈ సర్వే పేర్కొంది. బెస్ట్ సీఎంగా చత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ నిలిచారు. తెలంగాణలో బీజేపీ పుంజుకునే అవకాశం ఉందని తెలిపింది. సరే రాజకీయంగా ఈ సర్వేలు ఒకరికి అనుకూలంగా, మరొకరికి వ్యతిరేకంగా ఉంటాయనడంలో కూడా నిజం లేకపోలేదు. కానీ ఇందులో కొంత నిజం ఉండే అవకాశం ఉంది.
ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలే కారణమా.?
సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ముక్కుసూటి మనిషి అని రాజకీయ నాయకులు విమర్శిస్తారు. సొంత పార్టీ నాయకులు కూడా ఈ విషయం చెబుతుంటారు. అయితే సీఎం కేసీఆర్ ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఆయనకు ప్రజల్లో పెరిగిన ఆగ్రహానికి కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ఆందోళనలు నిర్వహించడం, తరువాత బ్యాక్ స్టెప్ వేయడం, ఈటల రాజేందర్ వ్యవహారం, కేవలం హుజురాబాద్ ఎన్నికల సమయంలోనే దళితబంధు అనే పథకం తీసుకురావడం, అక్కడే అధికంగా ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడం, ఇద్దరు, ముగ్గురు జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం వంటి చర్యలన్నీ సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో కోపం పెరగడానికి కారణంగా తెలుస్తోంది. కులాల వారీగా పథకాలు ప్రవేశపెట్టడం, తనకు అనుకూలంగా ఉన్న వారిని పార్టీలోకి తీసుకొని పదవులు ఇవ్వడం, రాజకీయంగా లబ్ది పొందేందుకు దిగజారిపోవడం వంటివన్ని తెలంగాణ సమాజం గమనిస్తోంది. దీంతో మెళ్ల మెళ్లగా సీఎం కేసీఆర్ చరిష్మా తగ్గుతోంది.
ఏది ఏమైనప్పటికీ టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది అనడం కాదనలేని సత్యం. ఇప్పటికైనా కొంత మార్పులు జరగకపోతే ఇటు టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా పుంజుకుంటున్నాయి. ఏ సందర్భంలో విమర్శలు గుప్పిద్దామా.? అనే కోణంలో ఆలోచిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.