ECI

 

హుజూరాబాద్ ,బద్వేల్ ఉప ఎన్నికల షెడ్యుల్ విడుదల

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల సమరానికి తెర లేచింది. కొద్ది నెలలుగా నిరీక్షిస్తున్న తెలంగాణలోని హుజూరాబాద్ – ఏపీలోని బద్వేలు ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలోని కడప జిల్లా బద్వేలు లో 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇక, తెలంగాణలో మాజీ మంత్రి ఈటల పైన భూ కబ్జా ఆరోపణలు..కేబినెట్ బర్తరప్ తో ఆయన టీఆర్ఎస్ తో పాటుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. ప్రస్తుతం ఆయన బీజేపీ అభ్యర్దిగా బరిలో నిలుస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. అధికార టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస యాదవ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అభ్యర్ధిని ఖరారు చేయాల్సి ఉంది. ఇక, ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబ్ 1న ఈ రెండు అసెంబ్లీ నియెజకవర్గాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక, కీలకమైన పోలింగ్ అక్టోబర్ 30న జరగనుంది. కాగా, నవంబర్ 2 న రెండు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇక, బద్వేలు నుంచి ఇప్పటికే టీడీపీ అభ్యర్దిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన రాజశేఖర్ ను టీడీపీ ఖరారు చేసింది. వైసీపీ నుంచి 2019 ఎన్నికల్లో గెలిచిన వెంకట సుబ్బయ్య కుటుంబానికి ఇస్తారా..లేక, మరొకరిని బరిలోకి దించుతారా అనేది తేలాల్సి ఉంది. షెడ్యూల్ విడుదల కావటంతో..ఎన్నికల కోడ్ ఈ రెండు అసెంబ్లీ పరిధి ఉన్న జిల్లాల్లో అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి ఇక, రాష్ట్రాల్లోని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారులు నిర్వహణ బాధ్యతలు స్వీకరించనున్నారు. షెడ్యూల్ రాకముందే హుజారాబాద్ లో హోరా హోరీగా సాగుతున్న ప్రచారం.. ఇప్పుడు ఎన్నికల తేదీ రావటంతో మరింత జోరు అందుకొనే అవకాశం ఉంది. ఇదే సమయంలో అక్కడ గెలుపు మీద ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో..టీఆర్ఎస్.. బీజేపీ..కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రచారంలోకి దిగే అవకాశం ఉంది. దీంతో..రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. బద్వేలు అభ్యర్ధి విషయంలో ఒకటి రెండు రోజుల్లో ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అనేక కొత్త నిర్ణయాలు తెర పైకి వచ్చాయి. అదే విధంగా.. ఇప్పుడు అక్కడ ఎన్నికల ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా మారింది. దీంతో..ఈ ఎన్నిక మరింత ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది.