రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్
రాజకీయ దురుద్దేశంతోనే అబద్దాలను ప్రచారం చేస్తున్నారన్న మంత్రి
ఆధారాలు లేక ఆగిన పిటిషన్, నేడు విచారణకు వచ్చే ఛాన్స్…?
హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) తనపై వదంతులు, లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ దురుద్దేశంతో, అసత్యాలను అబద్దాలను ప్రచారం చేస్తున్నారన్న కేటీఆర్.. సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావాను దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి గత కొంత కాలంగా తనపైన అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్వహిస్తున్న విచారణకు హాజరవుతున్న వ్యక్తులతో తనకు ఎలాంటి సంబంధం లేదు. ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేకున్నా, రేవంత్ రెడ్డి దురుద్దేశ పూర్వకంగా తన పేరును వాడుకుంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇలాంటి దుష్ప్రచారం వల్ల కలిగిన పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ని సైతం ప్రారంభించాలని కేటీఆర్ కోరారు. గౌరవ న్యాయస్థానం తనపై రేవంత్ చేస్తున్న అసత్య ప్రచారాలను గుర్తించి, ఇలాంటి దురుద్దేశ కార్యక్రమాలకు పాల్పడుతున్న నిందితులను తగిన విధంగా శిక్షిస్తుందన్న విశ్వాసం తనకు ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌పై కేటీఆర్ ఘాటుగా స్పందించిన విషయం విదితమే. తాను ఎలాంటి టెస్టులకైనా సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ టెస్టుకు సిద్ధమైతే.. తానే ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్తానని కేటీఆర్ ట్వీట్ చేశారు. చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో టెస్టులు చేయించుకునే స్థాయి తనది కాదని కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఒక వేళ తాను టెస్టులు చేయించుకుని, క్లీన్‌చీట్‌తో వస్తే రేవంత్ రెడ్డి తనకు క్షమాపణలు చెప్పి, పదవులు వదులుకుంటారా? అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్టులకు రేవంత్ సిద్ధమా? అని కేటీఆర్ నిలదీశారు. డ్రగ్స్ పరీక్షలకు తాను సిద్ధమని ఇప్పటికే చెప్పిన కేటీఆర్… అనవసరంగా దూషిస్తే రాజద్రోహం కేసు పెడతామని హెచ్చరించారు. ఈ విషయంలో తమకు మహారాష్ట్ర ప్రభుత్వమే స్ఫూర్తి అని ఇటీవల మీడియాతో చిట్ చాట్ లో చెప్పారు. రేవంత్ ఆరోపణలకు మరో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మద్దతు పలికారు. రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌ను స్వీకరించకుండా.. మంత్రి కేటీఆర్ పారిపోయాడని మండిపడ్డారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డీ ఛాలెంజ్‌లో ముందుకు వచ్చారని.. కానీ, కేటీఆర్ మాత్రం రాలేదన్నారు. విశ్వనియత నిరూపించుకోవాలంటే.. కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్‌కి రావాల్సిందేనని స్పష్టం చేశారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. 14 ఏళ్ల పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని అకున్ సబర్వాల్ నివేదిక చెప్పిందన్నారు. రాజకీయ నాయకులు, సినిమా తారలు డ్రగ్స్ విషయం లో క్లియర్ ఉండాలని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు విచారణలో వుండగానే ఆకున్ సబర్వాల్‌ను తప్పించారని మండిపడ్డారు. బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్ వరకు పబ్బులు వ్యాప్తి చెందాయని షబ్బీర్ అలీ తెలిపారు.
సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, పిటిషన్‌కు సంబంధించి సరైన ఆధారాలు లేవని కోర్టు బెంచ్ మీదకు వెళ్లలేదు. పరువు నష్టం దావాకు సంబంధించిన సరైన పత్రాలు సమర్పించలేదు.. దీంతో ఈ పిటిషన్ సెక్షన్ ఆఫీస్‌లోనే ఆగింది. నేడు పూర్తి ఆధారాలతో సమర్పిస్తామని కోర్టుకు మంత్రి కేటీఆర్ తెలిపారు.