CJI Ramana

 

సామాన్యుడి వాదన వీనేందుకూ రెడీ

 

🔹సుప్రీంకోర్టు సంచలనాలు, సంచలన తీర్పులు
🔹సుప్రీంకోర్టు తీర్పులపై సర్వత్రా చర్చ
🔹సుప్రీం తీర్పులతో వణుకుతున్న వ్యవస్ధలు
🔹దర్యాప్తు సంస్ధల పైనా ప్రభావం
🔹మహిళలకు అండగా సుప్రీంకోర్టు
🔹ఛీఫ్ జస్టిస్ నూ చేరుతున్న సామాన్యుల స్వరం

 

న్యూఢిల్లీ/హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) దేశ అత్యున్నత న్యాయస్ధానం తాజాగా జూలు విదుల్చుతోంది. సామాన్యుడు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ వరుసగా సంచలన ఆదేశాలు జారీ చేస్తోంది. ఓవైపు నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మరోవైపు బడుగు బలహీన వర్గాలు, మహిళలకు తామున్నామనే భరోసా ఇస్తోంది. మరోవైపు సంస్కరణలను సమర్ధిస్తూనే వాటి ప్రభావం సామాన్యుడిపై సాధ్యమైనంత తక్కువగా ఉండేలా ఆదేశాలు ఇస్తోంది. అదే సమయంలో రాజ్యాంగం ప్రకారం పౌరులకు ప్రాధమిక హక్కుల్లో లోటుపాట్లు ఎదురైతే ఎంతదూరమైనా వెళ్లి వాటిని కాపాడతామన్న సంకేతాలు ఇస్తోంది. దీంతో ఇప్పుడు సాధారణ ప్రజలు సైతం భారత ప్రధాన న్యాయమూర్తిని చేరుకోగలుగుతున్నారు. తమ స్వరాన్ని వినిపించగలుగుతున్నారు. భారత అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు గతంలో ఎన్నడూ లేనంత క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఒకప్పుడు సుప్రీంకోర్టు వరకూ వెళ్లాలంటే భయపడే స్ధాయి నుంచి ఇప్పుడు ఓ చిన్న లేఖతో భారత ప్రధాన న్యాయమూర్తిని సైతం చేరుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. దేశంలో ఎన్నడూ లేనంత భారీ స్ధాయిలో అతి తక్కువ సమయంలో కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం చేపట్టింది. దేశ చరిత్రలోనే ఎప్పడూ కనివినీ ఎరుగని రీతిలో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల్ని నియమించింది. అతి త్వరలోనే తొలి భారత మహిళా ప్రధాన న్యాయమూర్తిని ప్రజలు చూసే అవకాశం కల్పిస్తోంది. ఓవైపు ప్రభుత్వాల్ని గడగడలాడిస్తూనే మరోవైపు సామాన్యులకు భరోసా కల్పిస్తోంది. మరోవైపు కోర్టు బయట పరిష్కారాలకు కూడా దారి చూపడం ద్వారా కేసుల్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పిస్తోది. ఇందుకు సీజే ఎన్వీ రమణ చూపుతున్న చొరవే ప్రధాన కారణం.

సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన ప్రతీ తీర్పు సంచలనం రేపుతోంది. అది కరోనా మృతులకు పరిహారమైనా , ఆర్మీలో మహిళలకు చోటైనా, ఏడాదిలోపు ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్ కేసులు తేల్చేయాలన్న ఆదేశాలైనా, పెగాసస్ స్పై వేర్ పై పై తామే విచారణకు కమిటీ నియమించాలన్న నిర్ణయమైనా, నీట్ పరీక్షపై తీర్పులైనా, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అయినా.. ఏదైనా ఇప్పుడు సంచలనమే. వీటిపై గతంలో చాలాసార్లు పలు కేసులు వచ్చినా వీటిపై సుప్రీంకోర్టులో సాగదీత ధోరణి కనిపించేది. ఇప్పుడు అలా కాదు. ఏ వ్యవహారంపైనైనా, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందైనా అత్యున్నత న్యాయస్ధానం మాత్రం లెక్క చేయడం లేదు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, అధికారుల చర్యలు, విధానపరమైన అంశాల్లో సుప్రీంకోర్టు ఇస్తున్న ముక్కుసూటి తీర్పులతో వ్యవస్ధలు వణుకుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. గతంలో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్నా తమకేం ఇబ్బంది లేదని భావించిన పలు వ్యవస్ధలు, సంస్ధలు, ప్రభుత్వాలు ఇప్పుడు సుప్రీంకోర్టు క్రియాశీలతతో వణుకుతున్నాయి. సుప్రీంకోర్టు ఎప్పుడెలా స్పందిస్తుందో తెలియక రాజ్యాంగ విధుల నిర్వహణ విషయంలో పక్కదారి పట్టేందుకు భయపడుతున్నాయి. సుప్రీంకోర్టు క్రియాశీలత కారణంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. కరోనా మృతులకు పరిహారం ఇచ్చి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేంద్రానికి చుక్కలు చూపించడమే దీనికి నిదర్శనం.

గతంలో దర్యాప్తు సంస్ఘలు తీవ్రమైన నేరాలకు సంబంధించి కూడా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేసేందుకు ఏళ్ల తరబడి ఆలస్యం చేసేవి. తాజాగా సుప్రీంకోర్టు వాటి దుమ్ముదులపడం కూడా మొదలుపెట్టేసింది. ప్రజాప్రతినిధులపుై సీబీఐ, ఈడీ దాఖలు చేసిన కేసుల్లో ఛార్జిషీట్లు ఎందుుకు సకాలంలో దాఖలు కావడం లేదని ప్రశ్నించింది. దీంతో ఆయా సంస్ధలు ఇరుకునపడ్డాయి. అదే సమయంలో తమ ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదంటూ సీబీఐకి చురకలు అంటించింది. అదే సమయంలో దర్యాప్తు సంస్ధలకు బాస్ ల నియామకం విషయంలోనూ కేంద్రం సైతం అస్సలు ఛాన్స్ తీసుకునేందుకు సిద్ధంగా లేకపోవడం చూస్తుంటే సుప్రీంకోర్టు ప్రభావం ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మహిళా సాధికారత, సమాన అవకాశాల విషయంలో సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో చారిత్రక తీర్పులు ఇవ్వడంతో పాటు సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంది. ముఖ్యంగా మార్పు తనతోనే మొదలవ్వాలని భావించిన అత్యున్నత న్యాయస్ధానం.. ముందుగా మహిళా న్యాయమూర్తుల్ని సుప్రీంకోర్టులో నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. తద్వారా వారిలో ఒకరు తొలి భారత మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియామకం జరిగేందుకు అవకాశం కల్పించింది. స్వాతంత్ర భారతంలో తొలిసారి సుప్రీంకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అలాగే సైన్యంలోనూ మహిళల నియామకం జరగాలని, వారి కోసం ప్రత్యేక కమిషన్ ఉండాలని తీర్పు ఇచ్చింది. అంతే కాదు ఈ ఏడాది నవంబర్ లో జరిగే ఎన్డీయే పరీక్షలో మహిళలకు అవకాశం ఇవ్వడం కుదరదని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సైతం చెక్ పెట్టేసింది. మహిళలకు న్యాయం జరగడంలో ఆలస్యం కుదరదని తేల్సేసింది. అంతే కాదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో 50 శాతం మహిళా న్యాయమూర్తుల్ని నియమిస్తామని సీజే ఎన్వీ రమణ మరో సంచలన నిర్ణయం ప్రకటించారు.

చాలా కేసుల్లో తమ స్వరం కోర్టులు వినడం లేదని సాధారణ ప్రజలు, కక్షిదారులు ఆవేదన వ్యక్తం చేయడం చూస్తూనే ఉంటాం. ట్రయల్ కోర్టులు సైతం తమ వాదన వినడానికి సిద్ధంగా లేవని బాధపడుతున్న సామాన్యులకు ఇప్పుడు సుప్రీంకోర్టే నేరుగా తమ వాదన వినిపించేందుకు అవకాశం కల్పిస్తోంది. అదీ నేరుగా సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకే ఇప్పుడు ఎంతో మంది సామాన్యులు కీలకమైన అంశాలపై లేఖలు రాస్తున్నారు. తాజాగా గుంటూరుకు చెందిన పరంధామయ్య అనే బాధితుడు రివ్యూ, క్యూరేటివ్ పిటిషన్లను ఊరికే కొట్టేయొద్దంటూ సీజే ఎన్వీ రమణకే లేఖ రాశారు. దీంతో సుప్రీంకోర్టు సీజేకు తమ వాదన వినిపించేందుకు తమకున్న అవకాశం మరోసారి తెరపైకి వచ్చింది. అలాగే సుప్రీంకోర్టు కూడా హెబియస్ కార్పస్ తో పాటు పలు హక్కుల పిటిషన్ల విషయంలో నేరుగా జోక్యం చేసుకుని ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులకు రోజూ చీవాట్లు పెడుతూనే ఉంది. దీంతో సుప్రీంకోర్టుతో సామాన్యుల అనుబంధం పెరుగుతోంది. ఇది ఎంతో సానుకూల పరిణామమని న్యాయనిపుణులు సైతం వ్యాఖ్యానిస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది. తాముు ఓటేసి అధికారం ఇచ్చిన ప్రభుత్వాలపై జనం నమ్మకం కోల్పోతున్న వేళ సుప్రీంకోర్టు మాత్రం సామాన్యుడికి సైతం న్యాయం అందించేందుకు తీసుకుంటున్న చొరవ ప్రశంసలు అందుకుంటోంది.