ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ అక్షింతలు..
పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడితే ఎలా.?
ఘాటుగా ప్రశ్నించిన ఎన్జీటీ
రాయలసీమ ఎత్తిపోతలపై నిన్న ఎన్జీటీ విచారణ
అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ సర్కార్.. పర్యావరణ సమస్య లేదని స్పష్టం
ఏపీలో ప్రాజెక్ట్ లకు పర్యావరణ అనుమతుల సమస్య..
అమరావతి (ప్రశ్న న్యూస్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడం పట్ల జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పర్యావరణ చట్టాన్ని ఉల్లంఘించటం సిగ్గుచేటని వ్యాఖ్యానించింది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టులపై జస్టిస్ ఆదర్శ కుమార్ నేతృత్వంలోని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రధాన ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసిన ఏ ఒక్క అధికారిపైన చర్యలు తీసుకోకపోవడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం కాపర్ డ్యాం వల్ల ముంపు జరుగుతుంటే ఏమి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించిన జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ధర్మాసనం పోలవరం ముంపుపై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. మూడేళ్ల నుండి పోలవరం కాపర్ డ్యాం వల్ల ముంపు జరుగుతుంటే అధికారులకు కనిపించడం లేదా అంటూ నిలదీసింది. కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి కూడా చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఎన్జీటీ . సీపీసీబీ నివేదికలో కేసు ముగించాలన్న ఆత్రుత మాత్రమే కనిపించిందని మండిపడింది.
చట్టబద్దంగా నివేదిక ఇవ్వాలన్న చిత్తశుద్ధి లోపించిందని పేర్కొన్నఎన్జీటీ ధర్మాసనం పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టులపై తనిఖీలకు వెళ్లిన అధికారులు వాస్తవాలు వెల్లడించలేకపోయారని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇక ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి సైతం అక్షింతలు వేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ప్రభుత్వమే పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడితే ఎలా అంటూ ఘాటుగా ప్రశ్నించింది. పర్యావరణ ప్రభావ అంచనా తూతూమంత్రంగా చేపట్టారని ప్రభుత్వ వైఖరిని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ తప్పు పట్టింది. విచారణకు సంబంధించి పూర్తి తీర్పు ఇవ్వనున్న ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణం చేసిన రాయలసీమ ఎత్తిపోతల పథకం తో పాటుగా, అనేక ప్రాజెక్టులపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఇక తాజాగా పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం వ్యవహారంలో విచారణ జరిపిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.నిన్నటికి నిన్న రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణానికి సంబంధించి జరిగిన విచారణలో భాగంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై బ్రాంచ్ ఆదేశాలను తాము ఏమాత్రం ఉల్లంఘించలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.రాయలసీమ ఎత్తిపోతలకు ప్రత్యామ్నాయ ప్రతిపాదన ప్రకారం అవసరమైన ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, అక్కడ భూసేకరణ చేయాల్సిన అవసరం కూడా లేదని వెల్లడించింది. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా ఈ ప్రాంతం ఎత్తిపోతల నిర్మాణానికి అనువైనదని తేల్చిందని పేర్కొంది. ఇక పర్యావరణపరంగా ఎలాంటి సున్నితమైన ప్రాంతాలు లేవని పులుల అటవీ రిజర్వు ప్రాంతం కూడా చాలా దూరంగా ఉందని, పర్యావరణానికి విఘాతం కలిగే అవకాశాలు ఏమాత్రం లేవని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకం వల్ల ఆయకట్టుకు నీరు ఇవ్వడం లేదని, తమ వాటా కంటే అదనపు నీటిని వినియోగించుకోవడం లేదని, కాల్వల సామర్థ్యం కూడా పెంచటం లేదని స్పష్టం చేసింది ఏపీ సర్కార్. రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు అఫిడవిట్ దాఖలు చేసి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదని దాన్ని కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక నిత్యం ఏదో ఒక ప్రాజెక్టుపై, రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఈ పిటిషన్ లు దాఖలు అవుతూనే ఉండగా వాటి నుండి బయట పడటం కోసం ఏపీ సర్కార్ తమ వంతు ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహానికి గురి అవుతూనే ఉంది.
Related posts:
తెలంగాణ కాంగ్రెస్ బాస్ గా రేవంత్
దళిత బంధుపై పిల్ కాదు..పిటిషన్ వేయండి... - హైకోర్టు ధర్మాసనం
కేసీఆర్, మోడీ తీరుపై జగన్ గుర్రు
విద్యుత్ కొరత పై సీఎం జగన్ యాక్షన్ ప్లాన్..
రాజద్రోహం చట్టంపై సమీక్షకు - సుప్రీం రెడీ
వాసాలమర్రి మీద కేసీఆర్ కు ఎందుకంత ప్రేమ...
ప్రభుత్వ ఉద్యోగాలు అసాధ్యం..?
తెలంగాణలో పాదయాత్రలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు