E-Rupi

 

ఈ – రూపీ ని విడుదల చేసిన ప్రధాని

 

🔳భారత్ ఆర్థికంలో మరో అధ్యాయం 
🔳యాప్ లేకుండా పేమెంట్స్
🔳ఈ-రుపీ అంటే ఏంటి.?
🔳ప్రభుత్వ పథకాల్లో ఈ-రుపీ కీలకం

 

న్యూఢిల్లీ (ప్రశ్న న్యూస్) దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత పెరిగిన డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ.. కరోనా విలయంతో మరింత ఊపందుకుంది. ఆ క్రమంలోనే యూపీఐ చెల్లింపులకు సంబంధించి మరో కొత్త అధ్యయనంగా భావిస్తోన్నఈ-రుపీ విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో వర్చువల్ పద్దతిలో రిమోట్ నొక్కడం ద్వారా ప్రధాని ఈ-రుపీని ఆవిష్కరించారు. నగదురహిత లావాదేవీల ప్రోత్సాహం, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ-రుపీ విధానాన్ని తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో ఈ విధానాన్ని అభివృద్ధి చేశారు. బ్యాంక్‌ ఖాతాలు , కార్డులు , యాప్‌లతో సంబంధం లేకుండా చెల్లింపులు చేసే విధంగా ఈ-రూపీని రూపొందించారు.

ఈ-రుపీ విడుదల సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. డిజిట‌ల్ లావాదేవీలు, నేరుగా న‌గ‌దు బ‌దిలీ విష‌యంలో దేశంలో ఈరూపీ కీల‌క‌పాత్ర పోషించనున్న‌ట్లు తెలిపారు. టార్గెట్ ప్ర‌కారం.. చాలా పార‌ద‌ర్శ‌కంగా.. ఎటువంటి లీకేజీ లేకుండా న‌గ‌దును డెలివ‌రీ చేయ‌వ‌చ్చు అని మోదీ అన్నారు. అత్యాధునిక టెక్నాల‌జీ సాయంతో 21వ శ‌తాబ్ధంలో ఇండియా ముందుకు వెళ్తున్న తీరుకు ఈ-రూపీని ఉదాహ‌ర‌ణ‌గా భావించ‌వ‌చ్చు అని ఆయ‌న చెప్పారు. డిజిటల్ చెల్లింపుల గతిని మార్చేసే ఈ-రుపీ వ్యవస్థలో ఒక క్యూర్‌ కోడ్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ స్ట్రింగ్‌ వోచర్‌లను లబ్ధిదారుడి మొబైల్‌ ఫోన్‌కి పంపిస్తారు. వీటినే ఈ-రుపీగా భావించవచ్చు. అందులో నిర్దేశిత డబ్బును ముందే లోడ్‌ చేసి పెడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌ వోచర్ల లాంటివే. ఈ వోచర్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట అంటే సంబంధిత సేవలు అందేచోట వినియోగించుకోవచ్చు. దీనికి బ్యాంకు, యాప్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌.. వంటి మధ్యవర్తిత్వ వేదికలేవీ అవసరం లేదు. వీటిని రీడీమ్ చేసుకోవడానికి వోచర్ కార్డు లేదా హార్డ్ కాపీ అవసరం లేదు. సందేశంలో వచ్చిన క్యూఆర్ కోడ్ ఉంటే సరిపోతుంది. స్మార్ట్‌ఫోన్‌ లేని వారు వోచర్‌ కోడ్‌ చెప్పినా చాలు.

డిజిటల్ చెల్లింపుల ఈ-రూపీ వ్యవస్థను అమలు చేసేందుకు కొన్ని కీలక బ్యాంకులు ముందుకు వచ్చాయి. మరికొన్ని బ్యాంకులు కూడా రానున్న రోజుల్లో వీటిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ వోచర్లు కావాల్సిన వారు సదరు బ్యాంకులను సంప్రదించాలి. ఫోన్‌ నంబరుతో సహా లబ్ధిదారుల వివరాలను వారికి అందజేయాలి. వోచర్‌ విలువ ఎంతో కూడా తెలియజేసి.. మొత్తం సొమ్మును చెల్లించాలి. అలాగే ఆ చెల్లింపులు ఎందుకోసం చేస్తున్నారో కూడా తెలియజేయాలి. అక్కడి నుంచి ఆ వోచర్లు అవి ఇస్తున్న వారి పేరు మీదుగా నేరుగా లబ్ధిదారుడికి చేరిపోతాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆవిష్కరించిన ఈ-రుపీ విధానం రాబోయే రోజుల్లో అన్ని రంగాలకూ కీలకం కానుంది. ప్రధానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఇది ప్రయోజనకరంగా మారనున్నాయి. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేనందున ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండదు. అలాగే ఆరోగ్యం, ఔషధాలకు సంబంధించిన సేవలను అందజేసేందుకు కూడా ఇవి ఉపయోగకరంగా ఉండనున్నాయి. మాతా-శిశు సంబంధిత, టీబీ నిర్మూలన, ఆయుష్మాన్ భారత్‌, పీఎం ఆరోగ్య యోజన, ఎరువుల రాయితీ.. వంటి పథకాల అమలు ఈ-రూపీ ద్వారా మరింత సమర్థంగా జరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల సంక్షేమం సహా ఇతర ప్రయోజనాలను అందించేందుకు ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు సైతం ఈ-రూపీని వినియోగించవచ్చని ప్రభుత్వం తెలిపింది.