Earthquakes in Tirupati District
తిరుపతి జిల్లాలో భూప్రకంపనలు
– భయపడిపోయిన స్థానికులు..
– రిక్టర్ స్కేలు మీద 3.9గా నమోదు..
తిరుపతి (ప్రశ్న న్యూస్) తిరుపతి, నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి భూమి కంపించింది. పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలంతా భయపడిపోయారు. ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. సూళ్లూరుపేట, దొరవారి సత్రం, నాయుడుపేట మండలాల్లో గురువారం రాత్రి 8.40 నిమిషాల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.
భూ ప్రకంపనలతో భయపడిన స్థానికులు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలతో కొన్నితోట్ల ఇళ్లల్లోని సామాన్లు కింద పడ్డాయి. మరికొన్ని చోట్ల సిమెంట్ రోడ్లకు బీటలు వారినట్లు స్థానికులు చెప్తున్నారు. మరోవైపు నాయుడు పేటలోని పిచ్చిరెడ్డి తోపు, మంగపతినగర్ ప్రాంతాల్లో కూడా గురువారం రాత్రి 5 సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. అయితే ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని ఏమైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే 08772236007 నంబర్ కు కాల్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీ కళ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు తిరుపతి జిల్లాలో భూమి కంపించిన విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ ధ్రువీకరించింది.
Also Read : 38 Mandhi Gulabi Nethalapai Kesulu
గురువారం రాత్రి 8 గంటల 43 నిమిషాలకు భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయని వెల్లడించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 3.9గా నమోదైనట్లు తెలిపింది. ఇదే సమయంలో జపాన్లోనూ భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలో భూప్రకంపనలు ఇదే తొలిసారేమీ కాదు. గతంలోనూ పలుమార్లు ఇలా భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే సమయంలో భూమి కంపించడంతో భయపడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.