అమ్మవారి నవదుర్గల అవతారాల్లో నాలుగవ అవతారం కూష్మాండ
4. కూష్మాండ :
నవరాత్రి ఉత్సవాలలో నాలుగువ రోజు అమ్మవారిని కూష్మాండ శ్రీ మహాలక్ష్మి దేవి రూపంముగా ఆరెంజ్ కలర్ లో అలంకరిస్తారు. ఈ రోజు న దేవికి నైవేద్యంగా మాల్పువా స్వీట్ డిష్ ను భక్తిశ్రద్ధలతో పెడతారు.
దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి ‘కూష్మాండ’ అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము లోని సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే.
‘అష్టభుజాదేవి’ అని కూడా అనబడు ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లిచుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద – అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే.
భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును.
కూష్మాండా ధ్యాన శ్లోకం :
“ సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥ “
Comments are closed, but trackbacks and pingbacks are open.