Quit India Movement

 

క్విట్ ఇండియా ఉద్యమానికి నేటితో 79 ఏళ్లు

 

🔹స్వాతంత్య్ర పోరాటంలో అదో మహత్తర ఘట్టం

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) పరాయి పాలన,పీడన నుంచి విముక్తి కొరకు మహాత్మాగాంధీ సారథ్యంలో జరిగిన మహత్తర ఉద్యమం ‘క్విట్ ఇండియా’. మాతృభూమి దాస్య శృంఖలాలను తెంచి దేశానికి స్వేచ్చ,స్వాతంత్య్రాలు తీసుకురావడంలో ఈ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. అగస్టు 8,1942న గాంధీ నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమానికి నేటితో 79 ఏళ్లు. ఈ నేపథ్యంలో అప్పటి పోరాటాన్ని ఒకసారి మననం చేసుకుందాం. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో క్విట్ ఇండియా ఉద్యమం పురుడు పోసుకుంది.బ్రిటీష్ పాలనపై తిరుగుబాటుకు ముంబైలోని కోవాలియా ట్యాంక్ మైదానంలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సభలో ‘డూ ఆర్ డై’ నినాదంతో మహాత్మాగాంధీ ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి పిలుపునిచ్చారు.దేశ స్వాతంత్ర పోరాటంలో ఒకరిగా నిలబడాల్సి వస్తే… యావత్ ప్రపంచాన్నైనా ఎదిరించి నిలుద్దాం… అంతేగానీ పోరాటంలో భయపడి వెనక్కి తగ్గకండి అన్నారు. ఉద్యమానికి ‘క్విట్ ఇండియా’ అనే పేరును ప్రతిపాదించినది స్వాతంత్య్ర సమరయోధుడు యూసుఫ్ మెహర్ అలీ. బ్రిటీష్ పాలకులు దేశాన్ని విడిచిపోవాలని కోరుతూ దాదాపు మూడేళ్ల పాటు ఈ ఉద్యమం కొనసాగింది.

ఆనాటి హిందూ మహాసభ,భారత కమ్యూనిస్ట్ పార్టీ,ముస్లిం లీగ్‌లు ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించడం గమనార్హం. మొదట్లో అహింసా పద్దతిలో కొనసాగిన ఈ ఉద్యమం బ్రిటీషర్ల అణచివేతతో తీవ్రరూపం దాల్చింది.ఉద్యమంలో పాల్గొన్నవారిని బ్రిటీష్ సర్కార్ ఉక్కుపాదంతో అణచివేసింది. దాదాపు 10వేల మంది ఉద్యమకారులను అరెస్ట్ చేసి జైళ్లల్లో పెట్టింది. మూడేళ్ల పాటు వారంతా జైళ్లలోనే మగ్గిపోయారు. తక్షణ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఉద్యమం విఫలమైనప్పటికీ ప్రజలందరినీ జాగృతం చేయడంలో… బ్రిటీషర్ల వెన్నులో వణుకు పుట్టించడంలో సఫలమైంది.ఆ పోరాటాన్ని చూసి అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ బ్రిటీష్ పాలకులపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం భారతీయులకు కొన్ని అధికారాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే భారతీయులు అందుకు ఒప్పుకోలేదు. అప్పటికే రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొని బ్రిటీష్ ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయింది. భారతీయుల్లో పెల్లుబికుతున్న వ్యతిరేకతను నియంత్రించడం కూడా ఇక తమవల్ల కాదనే నిర్ణయానికి వచ్చింది. అలా క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన మూడేళ్లకు అగస్టు 14 అర్ధరాత్రి,1947న దేశానికి బ్రిటీషర్లు స్వాతంత్య్రం ప్రకటించారు.