ktr

 

తెలంగాణలో పాదయాత్రలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

 

🔹రాష్ట్రంలో టిఆర్ఎస్ ను ఢీ కొట్టే వాళ్ళు ఎవరు లేరు
🔹రాష్ట్రంలో పాదయాత్రల సీజన్ వచ్చిందంటూ ఎద్దేవా
🔹కేసీఆర్ ని తిట్టినంతమాత్రాన గొప్పోళ్ళు అయిపోతారా ?
🔹పిచ్చి మాటలు మానుకో .. రేవంత్ రెడ్డి పై ధ్వజం

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదని పేర్కొన్నారు. సింగరేణి కోల్ మైన్స్ బిఎంఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్యతో పాటు పలువురు తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని కెసిఆర్ ప్రభుత్వం నెరవేర్చింది అని కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల పాత్ర 30 నియోజకవర్గాల్లో ఉంటుందని, కార్మికులంతా రాబోయే ఎన్నికల్లో పార్టీ తో కలిసి పనిచేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ను ఢీ కొట్టే వాళ్ళు ఎవరు లేరని తేల్చి చెప్పారు. కెసిఆర్ ని తిడితే ఓట్లు వస్తాయి అనుకోవడం వెర్రితనం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తిరుగులేని విజయాన్ని ప్రజలు అందించారని, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని పేర్కొన్న కేటీఆర్ కొంతమంది పాలపొంగు లెక్క ఎగసిపడుతున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలలుగన్న తెలంగాణ కావాలంటే అది కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రల సీజన్ వచ్చిందంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ పాదయాత్రతో ప్రతి ఊర్లోకి వెళ్లి బిజెపి పాలిత రాష్ట్రానికి, తెలంగాణాకు తేడా చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పథకాలు ఎందుకు అమలు చెయ్యటం లేదో బండి సంజయ్ చెప్పాలన్నారు. అక్బర్ బాబర్ కథలు మానుకొని తెలంగాణకు బీజేపీ ఏమి ఇచ్చిందో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు అయిన కేంద్రం ఇచ్చిందా అంటూ మండిపడ్డారు. మార్కెట్లో కొత్త బిచ్చగాళ్ళు పుట్టారని విమర్శించిన కేసీఆర్, నిన్న మొన్న పుట్టిన వాళ్లంతా పదవులు వచ్చేసరికి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. నాగార్జునసాగర్ లో జానారెడ్డిని ఓ కుర్రాడు ఓడించాడని, జిహెచ్ఎంసి తర్వాత బీజేపీ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. కెసిఆర్ ని గెలవాలంటే కెసిఆర్ కంటే ఎక్కువగా తెలంగాణను ప్రేమించాలని చాలెంజ్ చేశారు కేటీఆర్. కెసిఆర్ ని తిట్టినంతమాత్రాన గొప్పోళ్ళు అయిపోరని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు తలపడుతుంది రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్ తో అని గుర్తు చేశారు కేటీఆర్. కెసిఆర్ ను కొట్టాలంటే , తల పడాలంటే డైలాగ్స్ కొడితే చాలదని కేటీఆర్ స్పష్టం చేశారు.

బంగారు తెలంగాణ నిర్మాణం కోసం నిర్విరామంగా పోరాటం చేసిన వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్న ఆయన, కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తిని తీసుకువచ్చిన గొప్ప నాయకుడితో పోరాడుతున్నామన్న విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ నుంచి తెలంగాణాను గుంజుకోవడం ఎవరికీ సాధ్యం కాదని పేర్కొన్న ఆయన ఓటుకు నోటు కేసులో చంచల్గూడ జైలుకు వెళ్లిన రేవంత్ రెడ్డి మళ్లీ అవే నోట్ల కట్టలతో టిపిసిసి అధ్యక్ష పదవి కొన్నాడని కాంగ్రెస్ పార్టీ ఎంపీలే చెప్పారని ఎద్దేవా చేశారు.సోనియాను తెలంగాణ తల్లి అన్నాడు, చంద్రబాబును తెలంగాణ తండ్రి అన్నా అంటాడు అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్యం ప్రదర్శించారు. కెసిఆర్ పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదని రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు. ఇంత పదవి దొరికిందో లేదో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ప్రకటనలు,ర్యాలీలు చేస్తున్నారని మండిపడిన కేటీఆర్ పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడొద్దని రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. బజారు భాష మాట్లాడే వారిని పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని పేర్కొన్న కేటీఆర్, అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీని గెలిపించి ప్రజలు కేసీఆర్ పక్షాన నిలిచారని అభిప్రాయపడ్డారు.