harish Rao

 

తెలంగాణ అన్నీ రంగాల్లో అభివృద్ది.. దేశం కన్నా రాష్ట్రమే ఎక్కువ

 

🔹పన్నువసూళ్లు విషయంలో దేశంలోనే టాప్-1
🔹కేంద్రం తీసుకునేది ఎక్కువ…ఇచ్చేది తక్కువ…
🔹బంగ్లా కంటే వెనుకంజలో భారత్

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ రెట్టింపయిందని… రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకెళ్తోందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. జీఎస్‌డీపీలో దేశంలోనే మూడో స్థానం, దక్షిణాదిలో మొదటి స్థానంలో ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏటా ఒక శాతం జీడీపీ పెరుగుతూ వస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చేస్తున్న విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు.రాష్ట్రంలో సంపద పెరుగుదల, ఆర్థిక పరిస్థితిపై హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ) కార్యాలయంలో మంత్రి హరీశ్‌ రావు మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశం కంటే రాష్ట్ర గ్రోత్ రేట్ ఎక్కువగా ఉందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4 శాతం అని చెప్పారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం ఉందన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి బంగ్లాదేశ్‌ కంటే పడిపోయిందని వివరించారు. బంగ్లాదేశ్‌లో తలసరి ఆదాయం భారత్‌ కంటే 10 డాలర్లు ఎక్కువగా ఉందని వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో తలసరి ఆదాయం 1885 డాలర్లు, భారత్‌లో తలసరి ఆదాయం 1875 డాలర్లు అని వివరించారు. ఆరేళ్లలో తెలంగాణ వృద్ధి రేటు నంబర్ వన్‌గా ఉందన్నారు. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణది మూడో స్థానం అని చెప్పారు. తలసరి ఆదాయంలో దక్షిణ భారతదేశంలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనం అని వివరించారు. తలసరి ఆదాయంలో ఏడేళ్ల క్రితం తెలంగాణ 10వ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. తలసరి ఆదాయంలో గత ఏడేళ్లలో 7 రాష్ట్రాలను తెలంగాణ అధిగమించిందన్నారు.

2014-15 తర్వాత తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల్లోనే 11.5శాతంతో అత్యధిక సగటు వృద్ధిని తెలంగాణ నమోదు చేసిందన్నారు. 2014-15తో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం ఇప్పుడు 91.5 శాతం పెరిగిందని చెప్పారు. 2014-15తో పోలిస్తే దేశ తలసరి ఆదాయం ఇప్పుడు 48.7 శాతం మాత్రమే పెరిగిందన్నారు. దేశ సగటు తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయమే ఎక్కువని వెల్లడించారు. గత కొంత కాలం నుంచి సీఎం కేసీఆర్ అవలంభించిన విధానాల వల్లే తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందన్నారు. ఐటీ, ఇండస్ట్రీ, వ్యవసాయ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో రాష్ట్ర సంపద పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజల ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రాల సొంత పన్ను ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ అని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.66,648 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. 2014-15తో పోలిస్తే రాష్ట్ర సొంత పన్ను ఆదాయంలో 90 శాతం వృద్ధి సాధించామని స్పష్టం చేశారు. తెలంగాణ అప్పుల పాలవుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన విమర్శలకు.. మంత్రి హరీశ్‌రావు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కన్నా కూడా తెలంగాణ అభివృద్ది పథంలో ఉందని వివరించారు.

GDP

🔹రాష్ట్ర అభివృద్ది ఇలా…

పశువుల పెంపకం రంగంలో మూడు రెట్లు వృద్ది నమోదైందని.. చేపల పెంపకంలో ఆదాయం రెట్టింపు అయిందని హరీశ్ రావు పేర్కొన్నారు. వరి ఉత్పత్తిలో రూ.9,528 కోట్ల ఆదాయం నుంచి రూ.47,440 కోట్లకు ఆదాయం పెరిగిందన్నారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని చెప్పారు. దాదాపు 30 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు ఉచితంగా కరెంటు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే కోతలు లేని కరెంటు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. తద్వారా పరిశ్రమలు, సర్వీస్‌, నిర్మాణ రంగాల్లో అద్భుత ప్రగతి సాధించామన్నారు.

కేంద్రానికి తెలంగాణ నుంచి వెళ్లే నిధులు ఎక్కువ.. కేంద్రం మనకు ఇచ్చేది తక్కువ అని హరీశ్ రావు విమర్శించారు. దేశ జీడీపీ కాంట్రిబ్యూషన్‌లో తెలంగాణది ఆరోస్థానం అని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 4 శాతం ఉన్న జీడీపీ ఇప్పుడు 5 శాతానికి పెరిగిందన్నారు. కరోనా ఏడాదిలోనూ 2.4 శాతం వృద్ధిరేటు సాధించామన్నారు. దేశంలో జీడీపీ వృద్ధి మైనస్‌ 3 శాతంగా నమోదైందని గుర్తుచేశారు. బంగ్లాదేశ్‌ కంటే భారత్‌ వృద్ధిరేటు చాలా తక్కువగా ఉందని… ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి గుర్తించాలన్నారు. సీఎం కేసీఆర్‌ అవలంభించే విధానాలతోనే తెలంగాణ వృద్ధిరేటు పెరుగుతున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థల నివేదికల ఆధారంగానే తాము ఈ విషయాలు చెబుతున్నామన్నారు. బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 1887 డాలర్లు కాగా, భారత్‌ తలసరి ఆదాయం 1877 డాలర్లుగా ఉందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,37,638గా ఉందన్నారు. తలసరి ఆదాయాన్ని చూస్తే ఎవరి పనితీరు ఎలా ఉందో అందరికీ అర్థమవుతుందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం 11.5 శాతం ఉంటే…. దేశ తలసరి ఆదాయం 4 శాతంగా ఉందన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పురోగతి సాధించామన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు దేశంలో తలసరి ఆదాయంలో 10వ స్థానంలో ఉన్నామని, ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నామని చెప్పారు. దేశ జీడీపీ ఎందుకు తగ్గిందో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.