Revanth

 

దళిత బంధుపై రేవంత్ రెడ్డి సంచలన డిమాండ్…

 

🔹ప్రగతి భవన్,సచివాలయం భూములు అమ్మైనా సరే…
🔹శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్…
🔹ఇచ్చిన భూములనే లాక్కుంటున్నారని రేవంత్ ఫైర్…

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ప్రస్తుతం తెలంగాణ రాజకీయమంతా హుజురాబాద్ ఉపఎన్నిక,దళిత బంధు పథకం చుట్టే తిరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైతే ఈ పథకాన్ని ప్రకటించారో… అనివార్యంగా ప్రతిపక్షాలు సైతం దానిపై మాట్లాడాల్సిన పరిస్థితి తలెత్తింది. పథకం అమలుపై అనేక సందేహాలు,అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఆరు నూరైనా దళిత బంధు అమలుచేసి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.ఈ పథకంతో ప్రతిపక్షాలను ఆయన ట్రాప్‌లో పడేశారన్న వాదన కూడా వినిపిస్తోంది. తాజాగా ఈ పథకంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు అమలుకు నిధులు లేకపోతే ప్రగతి భవన్,సచివాలయ భూములు అమ్మైనా సరే తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో పథకాన్ని అమలుచేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దళిత బంధు పథకంపై ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు. కేసీఆర్ పాలన దళిత,గిరిజనుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. కేవలం హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకొచ్చారని.. అంతే తప్ప దళితులపై ప్రేమ ఉండి కాదని అన్నారు.దళిత బంధు అమలవకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు డప్పు కొడుతామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఇందిరా భవన్‌లో టీపీసీసీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో పోడు భూముల పరిరక్షణ అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

టీఆర్ఎస్ పాలనలో ఇప్పటివరకూ ఎస్సీ,ఎస్టీల కోసం ఖర్చు చేసిన నిధులెన్నో చెప్పాలని… దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. గిరిజనుల పోడు భూములను లాక్కుంటున్న ప్రబుత్వం.. వారిపై దాడులు చేయిస్తూ అక్రమ కేసులు పెడుతోందన్నారు. దళిత,గిరిజన హక్కుల కోసం అగస్టు 9న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి సమరశంఖం పూరించబోతున్నామని చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలో దళిత గిరిజన దండోరా నిర్వహించి.. ‘ఇస్తావా… చస్తావా..’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత గిరిజనులకు భూముల పంపిణీ జరుగుతుందని అంతా ఆశించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కానీ కేసీఆర్ భూములు ఇవ్వకపోగా.. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూములనే లాక్కుంటున్నారని ఆరోపించారు. పోడు భూముల సమస్యను ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పించామన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే అన్నారు. పోడు భూములపై హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు.