eta

 

బీజేపీని అడ్డుకోవడం కేసీఆర్ జేజమ్మ నుంచి కూడా కాదు – ఈటల

 

🔹అడుక్కుంటే పదవులు రావు…
🔹కమలాపూర్ ఉద్యమాన్ని కాపాడింది నియోజకవర్గ ప్రజలు

 

హుజురాబాద్ ( ప్రశ్న న్యూస్) తాను డబ్బు,మద్యం,కుట్రలను నమ్ముకోలేదని… ప్రజలనే నమ్ముకున్న వ్యక్తినని మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తాను దేవుడిని నమ్మడంలో ఆలస్యం కావొచ్చు గానీ నియోజకవర్గ ప్రజలే తన నమ్మకం అని చెప్పారు. మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరించారు. హుజురాబాద్‌లో ఆదివారం(జూన్ 20) నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడారు. 2001 నుంచి ఈనాటి వరకు హుజురాబాద్‌లో అన్ని స్థాయి పదవులను 80 శాతం పైబడి గెలుచుకుంటూ వస్తున్నామని ఈటల రాజేందర్ అన్నారు. తమ బలగమని పెద్దదని చెప్పారు.’రాజేందర్‌కు ఏం తక్కువ చేశారు… కేసీఆర్ చేరదీయకపోతే రాజేందర్ చరిత్ర ఎక్కడిదని కొంతమంది మాట్లాడుతున్నారు… ఏ నాయకుడైనా ఒకసారి గాల్లో గెలవచ్చు… కానీ రెండోసారి తన సత్తా మేరకే ప్రజలు ఓట్లు వేస్తారు…’ అని ఈటల పేర్కొన్నారు. ఆనాడు కమలాపూర్‌ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలిచాక… తన పనితనం నచ్చి కరీంనగర్ జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారని… ఆ బాధ్యతలు ఎంత బాగా నెరవేర్చానో ఆయన అంతరాత్మకు తెలుసునని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.అడుక్కుంటే పదవులు రావు… ఒళ్లు వంచి పనిచేస్తే పదవులు వస్తాయని అభిప్రాయపడ్డారు.

ఆనాడు కరీంనగర్ కలెక్టరేట్ కింద టెంటు నిండాలంటే ఇదే కమలాపూర్ నియోజకవర్గ ప్రజలు సద్ది కట్టుకుని వచ్చి ఉద్యమాలు చేశారని ఈటల అన్నారు. 2005లో మున్సిపల్ ఎన్నికలు వస్తే కమలాపూర్ నియోజకవర్గ ప్రజలు ఇంటింటికి తిరిగి గెలిపించుకునే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. 2006లో ఆత్మగౌరవానికి దెబ్బ తగలిన నాడు కేసీఆర్ రాజీనామా చేసి వస్తే ఆ ఎన్నికల్లో పాల్గొని గెలిపించుకున్న చరిత్ర కరీంనగర్ జిల్లాకు ఉందన్నారు. 2008లో 16 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ఏడుగురే గెలిచారని… అందులో తానొకడినని గుర్తుచేశారు. తెలంగాణ తల్లి విముక్తి కోసం పదవిని గడ్డిపోచలా విసిరేస్తున్నానని ఆనాడు అసెంబ్లీలో ప్రకటించానని చెప్పారు. ఎన్ని జన్మలు ఎత్తినా తాను ఎమ్మెల్యే కాకపోయేవాడినని… తెలంగాణ వల్లే తాను ఎమ్మెల్యే అయ్యానని అసెంబ్లీలోనే చెప్పానన్నారు. 2018 నుంచే విబేధాలు ఉంటే… అప్పుడెందుకు నోరు మెదపలేదని కొంతమంది ప్రశ్నిస్తున్నారంటూ ఈటల దాన్ని ప్రస్తావించారు. పార్టీలో,ప్రభుత్వంలో.. ఎక్కడైనా వైరుధ్యాలు ఉంటాయని… కానీ భరించే స్థాయిని దాటిపోతే అక్కడ ఎవరూ ఉండలేరని అన్నారు. హుజురాబాద్‌లో కంచె చేనును మేస్తోందని అధికార పార్టీని విమర్శించారు. చిల్లర వ్యక్తులతో,కిరాయి మనుషులతో గతంలో తనపై కరపత్రాలు కొట్టించి,ప్రత్యర్థికి డబ్బులు పంపించి ఓడగొట్టే కుట్రలు చేశారని ఆరోపించారు. ఆఖరికి ఈడీ,ఏసీబీలకు కూడా తనపై ఫిర్యాదు చేయించారని చెప్పారు.అయినా అన్నీ దిగమింగుకుని ఉన్నానని చెప్పుకొచ్చారు.
హుజురాబాద్ ఉపఎన్నిక గురించి ప్రస్తావిస్తూ… ఎన్నికల సంఘం కేసీఆర్ ఆధీనంలో ఉండదని.. అది ఢిల్లీలో ఉంటుందని పేర్కొన్నారు. కేసీఆర్ తనకు నచ్చిన పోలింగ్ ఆఫీసర్లను నియమిస్తే ఊరుకునేది లేదన్నారు. హుజూరాబాద్ ఎన్నికలు ముగిశాక తెలంగాణ అంతటా తిరుగుతానని చెప్పారు. బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడం కేసీఆర్ జేజమ్మ నుంచి కూడా కాదని హెచ్చరించారు. నాయకులను కొనొచ్చు కానీ ప్రజలను కొనలేరని… పెన్షన్లు కేసీఆర్ తాత జాగీర్ కాదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పథకాలను ఆపడం ఎవరి వల్లా కాదని వ్యాఖ్యానించారు.