Bonalu

 

బోనమెత్తిన భాగ్యనగరం..

 

🔹ఘనంగా లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు..

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ఆషాఢ మాసం బోనాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఆదివారంతో నగరంలో బోనాల సందడి ముగియనుంది. గోల్కోండ కోటలో తొలివారం.. ఆ తర్వాత సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగిశాయి. ఇక పాతబస్తీ లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాలు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం 5 గంటలకు అమ్మవారికి అభిషేకంతో పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బోనాల జాతర కోసం కోవిడ్ నిబంధనలు దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేశారు అధికారులు. భాగ్యనగరంలోనే వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు కనుల పండువలా సాగుతున్నాయి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆదివారన బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివస్తున్నారు.
గతేడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో కేవలం ఇండ్ల వద్దనే మొక్కులు చెల్లించారు. ఈసారి వైరస్‌ ఉధృతి కాస్త తగ్గడంతో ప్రభుత్వం మొక్కులు చెల్లించుకునేందుకు అవకాశం ఇచ్చింది. ప్రతి ఏటా ఆషాఢమాసం చివరి వారంలో పాతబస్తీలో బోనాల వేడుకలు జరుగనుండగా.. ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. బోనాలు తీసుకువచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. చివరి ఆదివారం కావడంతో దాదాపు 2 వేలకుపైగా ఆలయాల్లో ఆషాఢ మాస బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. చార్మినార్ భాగ్యలక్ష్మి, మీరాలం మండి మహంకాళి, హరిబౌలి అక్కన్న మాదన్న ఆలయం, కార్వాన్‌ దర్బార్ మైసమ్మ, లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడారు. ఇక నేడు పలు ఆలయాల్లో రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. పలహార బండ్లు, ఘటాల ఊరేగింపుతో బోనాల వేడుకల పూర్తికానున్నాయి. తెల్లవారుజామున అభిషేకం నిర్వహించగా.. అలంకరణ అనంతరం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. లాల్‌ దర్వాజ సింహవాహిని ఆలయంలో సోమవారం రంగంతో పాటు అంబారీ ఊరేగింపు కార్యక్రమాలు జరుగనున్నాయి. వేడుకల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ తొలి బోనం సమర్పించారు.దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి… ఆషాఢ మాస బోనాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో లాల్ దర్వాజ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. బీజేపీ సీనియర్ నేత విజయశాంతి కూడా అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు బోనం ఎత్తుకుంటానని మొక్కుకున్నానని, ఆ మొక్కు చెల్లించుకున్నానని చెప్పారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా అమ్మవారికి బోనం సమర్పించుకున్నానని తెలిపారు.భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరోసారి బంగారు బోనం సమర్పిస్తానని అమ్మవారికి మొక్కుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో దొరల రాజ్యం, దొంగల రాజ్యం నడుస్తోందని.. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. ప్రజా పాలన బీజేపీ వల్లే సాధ్యమవుతుందన్నారు.చెప్పారు.కరోనా నుంచి అందరం త్వరగా బయటపడాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. బోనాల పండగ నేపథ్యంలో ఆది,సోమవారాల్లో హైదరాబాద్,సైబరాబాద్ పరిధిలోని వైన్ షాపులు,బార్లు,కల్లు దుకాణాలు మూసివేసిన సంగతి తెలిసిందే. నిబంధనలు బేఖాతరు చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. మరోవైపు, పండగ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి.పలు మార్గాల్లో వాహనాలను అనుమతించట్లేదు.