Modi

 

భారీగా పడిపోయి మోదీ గ్రాఫ్.. ఏడాదిలో 40 శాతం తగ్గిన పాపులారిటీ

 

🔹ప్రజాదరణ తగ్గినా ప్రదాని రేసులో మోదీ టాప్.
🔹గతేడాది పోల్చితే పెరిగిన రాహుల్ పాపులారిటీ.
🔹ప్రధాని రేసులో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ్రాఫ్ అమాంతం పడిపోయినట్టు ఇండియా టుడే నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. తాజా సర్వే ప్రకారం గతేడాది ఆగస్టు నాటికి 66 శాతం ఉన్న మోదీ పాపులారిటీ.. 26 శాతానికి పడిపోవడం గమనార్హం. అయితే, ఉత్తమ ప్రధాని రేసులో మాత్రం మోదీ అగ్రస్థానంలో ఉండటం ఊరటనిచ్చే అంశం. తదుపరి ప్రధానిగా ఎవరుండాలి.. రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేయగలరా? దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ‘మూడ్ ఆఫ్ నేషన్’ పేరిట ఈ సర్వే జరిగింది. ఈ ఏడాది జనవరి నాటికే మోదీ పాపులారిటీ 38 శాతానికి పడిపోగా.. అది ఆగస్టు నాటికి మరింత క్షీణించి 26 శాతానికి చేరింది. అయినప్పటికీ దేశ ఉత్తమ ప్రధానిగా 24 శాతం మంది మోదీకి జైకొట్టారు. ఆ తర్వాతి స్థానంలో యోగి ఆదిత్యనాథ్‌ (11%), కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ (10 శాతం) ఉన్నారు. గత ఏడాదితో పోల్చితే రాహుల్ పాపులారిటీ రెండు శాతం పెరిగిందని సర్వే పేర్కొంది. జులై 10 నుంచి 20 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో పాపులారిటీ తగ్గినప్పటికీ అత్యుత్తమ ప్రధాని మోదీయేనని 27 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆ తర్వాతి స్థానంలో అటల్‌ బిహారీ వాజపేయి (19%) నిలిచారు. అలాగే ప్రధానిగా మోదీ స్థానాన్ని భర్తీచేసే సత్తా అమిత్‌షాకు మాత్రమే ఉందని 29% మంది అభిప్రాయపడగా.. 19 శాతం మంది యోగికి మద్దతుగా నిలిచారు.ఎన్‌డీఏ ఆర్థిక విధానాల వల్ల బడా కార్పొరేట్‌ సంస్థలే ఎక్కువ లబ్ధి పొందాయని 46 శాతం మంది అభిప్రాయపడగా.. ఆర్థిక వ్యవహారాల్లో మోదీ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తోందని భావిస్తున్నవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ ఏడాది జనవరిలో 66 శాతం మంది భేషుగ్గా ఉందని చెప్పగా.. ఇప్పుడది 47 శాతానికి తగ్గిపోయింది. ఎన్‌డీఏ హాయంలో మతసామరస్యం మెరుగుపడిందని జనవరిలో 55 శాతం మంది చెప్పగా.. ప్రస్తుతం వారి సంఖ్య 34 శాతానికి పడిపోయింది.

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను సవరించాలని 57 శాతం మంది భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారికి ఉద్యోగాలు.. ప్రభుత్వ పథకాలకు అనర్హులను చేయాలని.. ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించాలని 61% మంది డిమాండ్‌ చేశారు. మహిళా భద్రతలో భారతదేశం భేష్‌ అనేవారి సంఖ్య 45- 38 శాతానికి తగ్గింది. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే వారి సంఖ్య 42 నుంచి 45 శాతానికి పెరిగింది. అరెస్టులకు భయపడి నిరసన తెలిపేందుకు ప్రజలు జంకుతున్నారని 51% మంది అభిప్రాయపడ్డారు.మొత్తం దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 115 పార్లమెంట్ స్థానాలు, 230 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 14,559 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, అసోం, బిహార్, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హరియాణా, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్‌లోని 71 శాతం మంది గ్రామీణ, 29 శాతం మంది పట్టణ ప్రాంతాలకు చెందినవారిని ప్రత్యక్షంగా, టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం కావడమే ఎన్‌డీఏ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమని 29 శాతం మంది.. ఆర్టికల్ 370 రద్దే భారీ విజయమని 22 శాతం మంది అభిప్రాయపడినట్లు సర్వే వెల్లడించింది. కాగా.. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం అతిపెద్ద వైఫల్యమని 29 శాతం మంది వెల్లడించారు. నిరుద్యోగాన్ని అరికట్టకపోవడంపైనా అసంతృప్తి నెలకొంది. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కొవిడ్‌ మహమ్మారి అని సర్వేలో అత్యధికులు (28%) అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదలే పెద్ద సమస్యని 19 శాతం మంది, నిరుద్యోగమేనని 17 శాతం మంది తెలిపారు.