revanth reddy

 

సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసులో బాంబు పేల్చిన రేవంత్

 

🔹కేటీఆర్ గోవా ఎందుకెళ్లారు.?

 

హైదరాబాద్ (ప్రశ్న న్యూస్) టాలీవుడ్ నటులు ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రగ్స్ కేసు అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమగ్రంగా విచారణ చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో కేటీఆర్ దగ్గరవారికి ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. గత నాలుగు రోజులుగా కేటీఆర్ ఆందోళనలో ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసలు మంత్రి కేటీఆర్ గతంలో గోవాకు ఎందుకు వెళ్లారని.. ఆ పర్యటన వివరాలు బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని తాము గతంలోనే హైకోర్టులో కేసు వేశామని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చెప్పాలని హైకోర్టు అనేక సార్లు కోరిందని రేవంత్ రెడ్డి అన్నారు. నాలుగేళ్ల తరువాత ఈ కేసును తామే విచారిస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. కేసు క్లోజ్ చేసిందని విమర్శించారు. ఎవరిని తప్పించేందుకు ఈ కేసును మూసేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి ఈడీ మరోసారి కొందరికి నోటీసులు ఇచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఏ ఆధారాలతో ఈడీ వారికి నోటీసులు ఇచ్చిందో చూడాలని వ్యాఖ్యానించారు. డబ్బు, బ్యాంక్ అకౌంట్ లేదా హవాలా లావాదేవీలు జరిగితేనే ఈడీ రంగంలోకి దిగుతుందని అన్నారు. ఈ కేసు విచారణ చేపట్టిన అకుల్ సబర్వాల్‌ను ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు.

డ్రగ్స్ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించడం లేదని కేంద్ర సంస్థలు ఇప్పటికే అఫిడవిట్ వేశాయని.. అయినా తాము ఈ కేసు విచారణ చేపడతామని తెలిపాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసులో విషయంలో కేటీఆర్ సహా ఎవరిపైనా తాను ఆరోపణలు చేయడం లేదన్న రేవంత్ రెడ్డి.. కేసు విచారణ సమగ్రంగా చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్‌తో పిల్లల భవిష్యత్తును నాశనం అవుతున్నా.. ఈ విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌ని అతలాకుతలం చేసిన డ్రగ్స్‌ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మరుగునపడ్డ ఈ కేసులో ఈడీ అకస్మాత్తుగా దూకుడు పెంచింది.బుధవారం 12 మందికి నోటీసులు జారీ చేసింది. ఇందులో 10 మంది టాలీవుడ్ ప్రముఖులు,ఇద్దరు బయటి వ్యక్తులు ఉన్నారు. విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో ఈడీ పేర్కొంది. వీరిలో పూరీ జగన్నాథ్, రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్‌ సింగ్, చార్మి, రవితేజ, నవ్‌దీప్, ముమైత్‌ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్, ఎఫ్‌–క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ కూడా ఉన్నారు. వీరిని ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 22 వరకు విచారించనున్నారు.ఇదిలా ఉంటే తమకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని కొంతమంది నటులు పేర్కొన్నారు. అయితే ఈడీ మాత్రం అందరికి నోటీసులు జారీ చేశామని వెల్లడించింది.